
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్ర
కొనుగోలు కేంద్రాల్లో నిలదీసిన రైతులపై గూండాయిజమా?
రైతాంగంపై బీజేపీ గూండాల దాడి అప్రజాస్వామికం
ఆరేండ్లుగా ప్రశాంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
నల్లగొండ, నవంబర్ 15 : ‘ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్ర చేస్తున్నది. దమ్ముంటే కేంద్రం నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని అనుమతి ఇప్పిస్తారా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నిలదీశారు. సంజయ్ సోమవారం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పర్యటనలో బీజేపీ కార్యకర్తలు రైతులపై రాళ్ల దాడి చేయడాన్ని మంత్రి ఖండించారు. బీజేపీ కుట్రలు తెలిసిన రైతాంగం సంజయ్‌ను నిలదీస్తే.. ఆ పార్టీ గూండాలతో రైతులపై దాడికి దిగడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆరేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే కేంద్రం ఈసారి ఉద్దేశ పూర్వకంగానే తెలంగాణలో కుట్రలు పన్ని రైతులపై దాడికి ప్రయత్నం చేయిస్తుందని విమర్శించారు. కరోనా సమయంలోనూ ధాన్యం కొనుగోలు చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో, అందులో నల్లగొండలో అధిగ దిగుబడి వచ్చిందని, ఇది తట్టుకోలేని బీజేపీ కుయుక్తులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.