
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
తిరుమలగిరి/తుంగతుర్తి/నూతనకల్, నవంబర్ 15 : రైతులు సహకార బ్యాంకులను వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సూచించారు. డిపాజిట్ల సేకరణ మహోత్సవంలో భాగంగా సోమవారం తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్ మండల కేంద్రాల్లోని సహకార బ్యాంకుల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 30 వరకు డిపాజిట్ల సేకరణ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు డిపాజిట్లు చేసుకోవాలని సూచించారు. గతంలో నల్లగొండ జిల్లా కేంద్ర బ్యాంకు రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండగా, ప్రస్తుతం అది రూ.1500 కోట్లకు చేరిందని తెలిపారు. రుణాల అందజేతలో ఇతర బ్యాంకులకు ధీటుగా పని చేస్తుందని అన్నారు. గ్రామీణ రైతుల బిడ్డల కోసం రూ.25 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 250 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పంట రుణాలను రూ.లక్ష నుంచి రూ.3లక్షలకు, మార్ట్గేజ్ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు గతంలో ఉన్న రూ.2.5 లక్షలు ఉన్న వాల్యుయేషన్‌ను రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. తిరుమలగిరి బ్యాంకు ద్వారా రూ.30లక్షల డిపాజిట్లు సేకరించినట్లు చెప్పారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రైతులు లబ్ధిపొందాలని సూచించారు. ఫిక్స్డ్ డిపాజిట్లో భాగంగా సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు రూ.3వేల కోట్ల రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో ఏటీఎం సెంటర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం బ్యాంకు సిబ్బంది గొంగిడి మహేందర్‌రెడ్డిని సన్మానించారు. మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. కార్యక్రమాల్లో డీజీఎం ఉపేందర్‌రావు, ఏజీఎం కృష్ణలత, తిరుమలగిరి, తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్ పీఏసీఎస్ చైర్మన్లు పాలెపు చంద్రశేఖర్, గుడిపాటి సైదులు, కుంట్ల సురేందర్‌రెడ్డి, కనకటి వెంకన్న, సీఈఓ వెంకటేశ్వర్లు, మేనేజర్ శ్రవణ్, ఇన్చార్జి సీఈఓ రఫీ, సిబ్బంది పాల్గొన్నారు.