
కట్టంగూర్/నార్కట్‌పల్లి నవంబర్ 15: ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని డీఆర్డీఓ కాళిందిని రైతులకు సూచించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల, మునుకుంట్ల, పరడ, కురుమర్తి, నార్కట్‌పల్లి మండలం నెమ్మాని, తిరుమలగిరి, మాండ్ర గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాచర్, కాంటాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో103 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 3 కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు. ఇప్పటి వరకు 1.63 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ చేస్తామన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. తేమ శాతం 17 కంటే తక్కువగా ఉంటే ధాన్యం కొనుగోలు చేస్తామని, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకోమన్నారు. రైతులు కేంద్రాల్లో ఆరబెట్టుకునే ధాన్యానికి నిర్వాహకులకు సంబంధం లేదని, కాంటా వేసిందానికి బాధ్యత వహిస్తామన్నారు. కట్టంగూర్ మండలంలో డీపీఎం అరుణ్‌కుమార్, ఏపీఎంలు చౌగోని వినోద, సీసీలు కాడింగ్ శంకర్, మట్టయ్య, ఎస్ఆర్పీ స్వాతి పాల్గొన్నారు. నార్కట్‌పల్లి మండలంలో ఏపీఎం కృష్ణ, ఏఈఓ విష్ణువర్ధన్ రెడ్డి, వీఓఏలు పాల్గొన్నారు.
కేతేపల్లిలో..
కేతేపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్ మోహన్‌రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నిర్ణీత తేదీల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఏఓ బి.పురుషోత్తం, సంఘబంధం అధ్యక్షురాలు రాచకొండ నాగమణి, ఏపీఎం యాదమ్మ, శాంత, జోజి, అమీర్ ఉన్నారు.