
వరి కన్నా.. ఆరుతడే ముద్దు..
నీటి వినియోగం, ఖర్చులు తక్కువ..
దిగుబడి, ఆదాయం ఎక్కువ
భూగర్భ జలాలకు శ్రీరామరక్ష
టీఆర్ఎస్ హయాంలో సూక్ష్మ సేద్యానికి పెద్దపీట
తొగుట, నవంబరు 15 : వరణుడు కరుణించాడు.. ఎక్కడ చూసినా చెరువు, కుంటలు, వాగులు, వంకలు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ప్రభుత్వం కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు అందజేస్తున్నది. ఇంకేముంది వరి నార్లు పోసి నాటేద్దాం. ఎక్కడ చూసినా ఇదే మాట. ఇంతలోనే యాసంగి వరికి సంబంధించి బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణలో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి స్థానంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలు వేసుకుంటే అధిక దిగుబడితోపాటు మంచి లాభాలూ ఆర్జించవచ్చని ప్రభుత్వం, అధికారులు పేర్కొంటున్నారు. కూర్చుని తింటే గుట్టలు కూడా కరుగుతాయి అన్నట్లు నేడు నిండుకుండల్లా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు వరి సాగు చేస్తే 4 మాసాల్లో వట్టి పోయే ప్రమాదం ఉంది. దీంతో భవిష్యత్‌లో కరువుఛాయలు ఏర్పడి వ్యవసాయంలో సంక్షోభం రావొచ్చు. అయితే, వరికి పెద్ద ఎత్తున నీటిని వినియోగించినప్పటికీ ఆరుతడి పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువగానే ఉంటుంది. ఒక ఎకరా వరి సాగుకు వినియోగించే నీటితో ఐదు ఎకరాల ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు. నేడు తొగుట మండలంతో పాటు సిద్దిపేట జిల్లాలో ఆరుతడి పంటల సాగుకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రిప్, స్ప్రింకర్లను రైతులకు అందజేయడంతో ఎంతో మేలు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు ఆవశ్యకతపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
సుమారు 20 ఏండ్ల క్రితం వరకూ వర్షాలు పుష్కలంగా కురువడంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేశారు. ఈ క్రమంలో ఏటా వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో వరి సాగు చేసినా నష్టాలపాలయ్యారు. నీళ్లు అడుగంటిపోయి భూగర్భజలాలు పాతాళానికి చేరుకోవడంతో బావుల స్థానంలో బోర్లు వేయడం ప్రారంభించారు. నీళ్లు పడితే సంతోషం, లేదంటే అప్పుల్లో కూరుకుపోవడం జరిగి క్రమేణా రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కరెంటు కోతలు, లో ఓల్టేజీ సమస్య కూడా ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా రైతులను మరింత కుంగదీసింది. ఇదంతా గతం ముచ్చట. కానీ, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుణుడు కరుణించడంతో సాగునీటి నిల్వలు పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా వట్టిపోయిన చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రైతుల కండ్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఈ సంతోషం ఇలాగే కొనసాగాలంటే సాగు నీళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది. వరి స్థానంలో ఆరుతడి పంటలను సాగు చేసేందుకు ఇది సరైన సమయమని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఆరుతడితోనే అధిక లాభాలు..
వరి పంట సాగు చేసే బదులు ఆరుతడి పంటలు పండిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగు కావడంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వరి సాగుకన్నా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఎకరం వరి సాగు నీటితో డ్రిప్ ద్వారా 4 ఎకరాలు సాగుచేసే అవకాశం ఉంది. తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చిన్న కమతాల రైతులు వరి సాగు చేసే బదులు ఆరుతడి పంటలైన పల్లికాయ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయల సాగు చేస్తే ఎక్కువ లాభాలు రావడంతో పాటు మళ్లీ వానలు పడే వరకు భూగర్భ జలాలు నిల్వ ఉంటాయి. అలాగే, ప్రకృతి వైపరీత్యాలు, వడగండ్ల వర్షాలకు ఆరుతడి పంటలు కొంత తట్టుకునే అవకాశం ఉంది.