
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డైరెక్టర్
పటాన్చెరు, నవంబర్ 15 : నూతన విద్యావిధానం (ఎస్ఈపీ) పరివర్తనాత్మక మార్పునకు ఉద్దేశించారని, సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలైనప్పుడు విద్యను కొనసాగించే వెసులుబాటు ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ (హెచ్ఆర్డీసీ) ప్రొఫెసర్ వై.నరసింహులు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్లో జాతీయ విద్యా విధానంపై సోమవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు. గూగుల్లో అందుబాటులో ఉన్న దానికంటే నాణ్యమైన బోధన చేయగల్గిన అధ్యాపకులు విద్యార్థుల మన్ననలను పొందుతారన్నారు. పాఠ్యాంశాలను చిన్న వీడియోలుగా రూపొందించి పరిమితి విధించకుండా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థి అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆన్లైన్లో నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. డిస్రప్టివ్ సాంకేతికతల ఆవిర్భవాన్ని నొక్కిచెబుతూ, ఇది మన భవిష్యత్నే మార్చబోతుందని చెప్పారు. ప్రశ్నించే ధైర్యంతో పాటు సృజనాత్మక నిర్మాణంతో కూడిన విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఉద్యోగాలు అభిజ్ఞా నైపుణ్యాలు (కాగ్నెటివ్ స్కిల్స్)తో ముడిపడి ఉన్నాయని, చక్కగా రాయడం, మంచి భావ ప్రకటనా నైపుణ్యాలు ఉన్నవారిని పరిశ్రమ కోరుకుంటోందని చెప్పారు. కళాశాలలో సీటు నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల వరకు ప్రతి దశలోనూ విద్యార్థిని పరీక్షిస్తారని, తద్వారా మార్కుల గురించి అధ్యాపకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. వారిలో నైపుణ్యాలు పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆన్లైన్ కోర్సులు, డిజిటల్ రిపోజిటరీలు, పరిశోధనలకు నిధులు, మెరుగైన సేవలు, మూక్స్, క్రెడిట్ ఆధారిత గుర్తింపు వంటి వాటికి నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తోన్నదని చెప్పారు. తొలుత, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పీ.శ్రీనివాస్ అతిథిని స్వాగతించగా.. ప్రొఫెసర్ కే.మంజునాథాచారి మాట్లాడారు.