గొలుసు కట్టుకు కేరాఫ్ తిర్మలాపూర్
మిషన్ కాకతీయతో పునర్జీవం
1200 ఎకరాల్లో వరి సాగు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక చెరువులు, కుంటలు కలిగిన గ్రామం
నారాయణపేట, నవంబర్ 14: ఆ ఊరికి చెరువులే ఆదెరువు అయ్యాయి.. నారాయణపేట మండలం తిర్మలాపూర్ గ్రామంలో ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 60 చెరువులు, కుంటలను ఏర్పాటు చేసుకోగా.. కాలక్రమంలో మూడు కుంటలు కనుమరుగై.. ప్రస్తుతం 57 మిగిలాయి. రికార్డుల్లో 48 చెరువులకు గుర్తింపు ఉన్నది.మిగితా వాటినీ నమోదు చేయాలని గ్రామస్తులు నీటి పారుదల శాఖాధికారులకు విన్నవించారు. అయితే చాలా వరకు వ్యక్తుల పేర్లనే చెరువులకూ పెట్టారు. గుట్టల నుంచి వచ్చే నీరు వృథా కావొద్దనే ఉద్దేశంతో వెనుకటి నుంచే చెరువులను తవ్వి నీటిని నిల్వ చేశారు. వీటి కింద 1200 ఎకరాల ఆయకట్టు ఉన్నది.
ఇక్కడి రైతులు వరి పండిస్తున్నారు.
నారాయణపేట మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామం గుట్టల మధ్యన ఉంటుంది. గుట్టల నుంచి వచ్చే వర్షం నీటిని వృథా చేయకుండా ఎక్కడైతే వర్షం నీరు వచ్చి చేరుతుందో ఇలా వెనుకటి కాలం నుంచి అక్కడ చెరువులను, కుంటలను తవ్వుతూ నీటిని నిల్వ చేసుకోవడం మొదలు పెట్టారు. ఒకటి,రెండు కాదు.. దాదా పు 60చెరువులు, కుంటలను గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో మూడు కుంటలు కనుమరుగు ప్రస్తుతం 57కుంటలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల రికార్డుల్లో 48చెరువులకు గుర్తింపు కూడా ఉన్నది. ఇటీవల మిగతా చెరువుల గుర్తింపు కోసం గ్రామస్తులు నీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా త్వరలోనే అధికారికంగా గుర్తింపు పొందనున్నాయి.
వ్యక్తుల పేర్లతో చెరువులకు పేర్లు..
గ్రామంలోని 57 చెరువుల్లో ఎక్కువగా వ్యక్తుల పేర్లతో పిలువబడుతున్నాయి. తిర్మలాపూర్ గ్రామంలో గుట్టల మీద నుంచి వచ్చే నీరు చేరే ప్రాంతంలో చెరువులు, కుంటలను తవ్వి నీటిని నిల్వ చేసుకున్నారు గ్రామస్తులు. నీటి నిల్వను బట్టి ఎక్కడైతే కుంటలు, చెరువుల తవ్వారో ఆయా వ్యవసాయ పొలానికి చెందిన వ్యక్తి పేర్ల మీద ఆ చెరువులకు, కుంటలకు పేర్లు పెట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నేటికి వాటిని అవే పేర్లతోనే పిలుస్తున్నట్లు చెప్పారు.
1200ఎకరాల్లో సాగు
పేరుకు తిర్మలాపూర్ చిన్న గ్రామమే అయినప్పటికీ గ్రామంలో ఏకంగా 1200ఎకరాల సాగు భూమి ఉన్నది. 57 చెరువులు, కుంటల్లో నిల్వ ఉండే వర్షం నీటితో గ్రామస్తులు వరి పండిస్తున్నారు. ప్రతి చెరువు, కుంట కింద పది నుంచి 50ఎకరాల వరకు సాగువుతున్నది. నీటి పారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం గ్రామంలోని గుర్తించిన 48 చెరువులు, కుంటల ద్వారా 750 నుంచి 1000 ఎకరాల భూమి సాగు అవుతుంది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఫేజ్ -1లో ఐదు, ఫేజ్ – 2లో ఏడు, ఫేజ్ -3లో 12 చెరువుల చొప్పున మొత్తం 24 చెరువులకు పూడిక తీత చేపట్టారు. పూడిక తీత, మరమ్మతుల కోసం సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60లక్షల మేరకు ఖర్చు చేశారు.