న్యాయవిజ్ఞాన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తి,
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డి
సిద్దిపేట టౌన్, నవంబర్ 3: న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి నీలిమా, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్తో కలిసి మువ్వన్నెల బెలూన్లు ఎగురవేశారు. సెట్విన్ ఆధ్వర్యంలో మహిళలకు అందజేసిన కుట్టుమిషన్లకు రిబ్బన్ కట్ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి లీగల్ సర్వీసెస్ క్యాంపు మాడ్యుల్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయాన్ని దిక్కరించే అధికారం ఎవరికీ లేదని, పేద వారికి లీగల్ రైడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఉచితంగా న్యాయసహాయం పొందేందుకు వీలుగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో న్యాయసేవా సదన్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. న్యాయవాదులు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. సేవలకు అర్హులైన వారు, కక్షిదారులు పైసా ఖర్చు చేసుకోకుండా ఉచిత సేవలు పొందాలని కోరారు. అందుకుగానూ న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.
క్రిమినల్ కేసుల్లో పేదలు దక్కని న్యాయం
–ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి
వంద క్రిమినల్ కేసులు కోర్టుకు వస్తే పేదలు కనీసం ఒక్కదాంట్లోనైనా న్యాయం పొందలేకపోతున్నారని, అందుకు చట్టాలపై అవగాహన లేకపోవడమే కారణమని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి మహిళకు ఎస్సీ, ఎస్టీలకు, కార్మికులకు, దివ్యాంగులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉందన్నారు. ఆర్టికల్ 39-ఏ ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కు కల్పించిందన్నారు. ఇది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో 1995లో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత న్యాయ సేవలు పొందే వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఉందన్నారు. అందుకు గానూ టోల్ ఫ్రీ నంబరు: 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉంచామన్నారు. ఉచిత న్యాయ సేవలపై అక్టోబర్ 2 నుంచి ఈ నెల 14 వరకు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారంతో ఉచిత న్యాయ సదస్సును విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత అన్నారు.
ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలు అందజేత…
హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డి, ఎస్సీ, బీసీ సంక్షేమశాఖల ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపల్ పరిధిలోని 12 మెప్మా పట్టణ స్వయం సహాయక బృందాలకు కోటి రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు.
ఆకట్టుకున్న స్టాళ్లు.. సాంస్కృతిక ప్రదర్శనలు
న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విపంచి కళానిలయంలో ప్రభుత్వ స్టాళ్లను ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సేవలను వివరిస్తూ పంచాయతీరాజ్, వ్యవసాయ, మున్సిపల్, ఉద్యానవన, స్త్రీశిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, రెవెన్యూ, మిషన్ భగీరథ, చేనేత, సైబర్ క్రైమ్, షీటీం, అటవీశాఖ అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేసి సేవలు, పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. స్టాళ్లను న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి సందర్శించి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి, పోలీసు కమిషనరేట్ కళాబృందాలు లీగల్ రైట్స్ ఉచిత న్యాయ సేవలపై పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాయి. అనంతరం న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డిని జ్ఞాపికతో ఘనంగా న్యాయమూర్తులు సత్కరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, న్యాయమూర్తులు సంతోష్‌కుమార్, సునీత, అనిత, మైత్రేయి, దుర్గాప్రసాద్, పుష్పలత, డీఆర్వో చెన్నయ్య, డీఆర్డీవో గోపాల్‌రావు, బీసీ సంక్షేమ జిల్లా అధికారి సరోజ, ఆర్డీవో అనంతరెడ్డి, డీసీపీలు శ్రీనివాసులు, రామేశ్వర్, నారాయణ, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్, సతీశ్ పాల్గొన్నారు.
కోమటి చెరువును సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి సిద్దిపేట కోమటి చెరువును హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్డెవిస్తో కలిసి సందర్శించారు. వారివెంట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, న్యాయమూర్తులు, న్యాయవాదులున్నారు.