వరికి సరైన ప్రత్యామ్నాయం పల్లికాయ సాగు
మార్కెట్లో పల్లి నూనెకు మంచి డిమాండ్
ఆ దిశగా ముందుకు సాగాలని రైతులకు వ్యవసాయ నిపుణుల సూచన
పల్లి సాగుకు జిల్లా భూములు అనుకూలం
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 13 : నూనెగింజల పంటల్లో వేరుశనగకు ప్రత్యేక స్థానమున్నది. ప్రస్తుతం పల్లి నూనెకు గిరాకీ అంతా.. ఇంతా కాదు. రైతులు యాసంగిలో పల్లికాయ పంటను సాగుచేస్తే లాభదాయకమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పల్లికాయ సాగుకు అనువైన భూములు ఉన్నాయి. ఇసుకతో కలిసి ఉన్న భూములతో పాటు ఎర్రచెల్క భూములు ఎక్కువగా ఉన్నందున వరికి ప్రత్యామ్నాయంగా పల్లికాయ మంచిదనేది నిపుణుల అభిప్రాయం.
వరి కంటే పల్లికాయే లాభదాయకం..
ఒక ఎకరంలో వరి సాగు చేసే కంటే పల్లికాయ వేస్తే సుమారు రూ.15 వేలు ఖర్చు అయితే సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు రూ.5,500 మద్దతు ధర ఉండగా, మార్కెట్లో రూ.7 వేల నుంచి రూ.9వేల వరకు ధర పలుకుతున్నది. క్వింటాలు ధర రూ.6,500 వచ్చినా ఎకరాకు రూ.65వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.50వేల మిగులనున్నది. ఎకరం వరి సాగు చేస్తే కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. 26క్వింటాళ్ల వడ్లు పండితే క్వింటాల్‌కు రూ.1940 ధర చొప్పున రూ.50వేలు వస్తుంది. పెట్టుబడి పోనూ మిగిలేది సుమారు 30వేలు మాత్రమే. ఎకరం వరిసాగు చేసేందుకు వినియోగించే నీటితో మూడెకరాల పల్లికాయ సాగు చేసుకోవచ్చు.
విత్తనాల ఎంపిక..విత్తుకునే విధానం..
స్పానిష్ గుర్తి, వర్ణీనియా గుత్తి అనే రెండు రకాల విత్తనాలుంటాయి. స్పానిష్ రకాల్లో కదిరి -6, కదిరి-9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ-91114ధరణి, టీఏజీ 24రకాల విత్తనాలు ఉన్నాయి. వర్జీనియా రకాల్లో కదిరి-7కదిరి-8 బోల్డ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇసుకతో కూడిన గరపనేలలు, నీరు త్వరగా ఇంకే ఎర్ర చెల్కనేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. బంకమన్ను, నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం కాదు. ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి.
విత్తన రకాలు.. వచ్చే దిగుబడులు..
కదిరి-6 విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి -9 విత్తనం సాగు చేస్తే ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్లు, కదిరి హరితాంద్రతో 10నుంచి 12, ధరణి ద్వారా 9నుంచి 10 టీఏజీ-24 ద్వారా 8 నుంచి 10, జేఎల్-24 ద్వారా 10 నుంచి 11, ఐసీజీవీ-91114 ద్వారా 10 నుంచి 12, కదిరి 7, 8 ద్వారా 12నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి – 1812 రకం విత్తనంతో ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
తెగుళ్లు..నివారణ చర్యలు..
పల్లికాయకు సోకే తెగుళ్లలో ముఖ్యమైనవి వేరుపురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె, శనగపచ్చ, తామర, పచ్చదీవపు, మొగ్గతొలుచు పురుగు, తాక్కా ఆకుపచ్చ తెగులు, మొదలుకుళ్లు, వేరుకుల్లు, కాండం కుళ్లు, మొవ్వకుళ్లు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి.
యాజమాన్య పద్ధతులు..
పల్లికాయ వేసేముందు భూసార పరీక్ష చేయించుకుంటే అందుకు అనుగుణంగా ఎరువులను వాడుకోవచ్చును. దుక్కిలో 3నుంచి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల పొటాష్, 18కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుంచి 15 కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సమ్కు మొక్క మొదళ్ల దగ్గర వేసి మట్టితో కూడ్చాలి. జింక్ లోపంతో ఆకులు చిన్నవిగా మారుతాయి. ఇందుకు ఎకరాకు 400గ్రామలు జింక్‌సల్ఫేట్‌ను 200లీట్ల నీటితో కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. ధాతులోపంతో ఆకులు పసుపు పచ్చగా, ఆతర్వాత తెలుపురంగుకు మారే ప్రమాదం ఉన్నందున ఎకరాకు ఒక కిలో అన్నబేది, 200గ్రాముల సెట్రిక్ఆమ్లం 200లీటర్ల నీటితో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు గడ్డి నివారణకు విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48 గంటల్లోపు అలాక్లోర్ 50శాతం ఈసీ 1.5 నుంచి 2లీటర్ల మందును 200లీట్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.