వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో
మంత్రి వీడియోకాన్ఫరెన్స్
పరిగి, నవంబర్ 13 : పేదలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఐసీయూ, డయాలసిస్ సెంటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. అక్కడి పరికరాల పనితీరుపై అధికారులు శ్రద్ద వహించాల్సిందిగా మంత్రి సూచించారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చినట్లు తెలిపారు. జిల్లాల్లోని సర్కారు దవాఖానల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, డీసీహెచ్‌లను మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏఎన్ఎంలు, మిగతా సిబ్బంది పనితీరును సమీక్షించాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 66శాతం, రెండో డోసు 20శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. ఓటరు జాబితా ప్రకారం మండల ప్రత్యేకాధికారులు ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ చేయిస్తున్నారని చెప్పారు. జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి తుకారాం, డాక్టర్ అరవింద్, డీపీవో మల్లారెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 104 శాతం కరోనా టీకాలు పూర్తి
షాద్‌నగర్, నవంబర్ 13 : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగడంపట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో 104 శాతం కొవిడ్ టీకాలు వేసినందుకు కలెక్టర్ అమయ్‌కుమార్, జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. శనివారం మంత్రి హరీశ్‌రావు కొవిడ్ వ్యాక్సినేషన్, దవాఖానల నిర్వహన తీరుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ఉన్నత అధికారులకు టీకాలు, దవాఖానల నిర్వహనపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 100 శాతం రెండు డోసుల కొవిడ్ టీకాలను పూర్తిచేయాలన్నారు. కమ్యూనిటీ దవాఖానలతో పాటు పీహెచ్‌సీలను కలెక్టర్లు తనిఖీచేయాలని సూచించారు. డయాలసిస్ కేంద్రాల్లో రోగులకు మెరుగైన సేవలు అందాలని, ఓపీ రోగుల సంఖ్య పెరుగాలని కోరారు. కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ మొదటి డోస్‌ను ఏవిధంగా పూర్తి చేశామో ఆదే తీరులో మరో రెండు వారాల్లో రెండో డోసును కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని సర్కారు దవాఖానలను తనిఖీచేసి, లోపాలను సవరిస్తామని మంత్రికి వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, పంచాయతీ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.