
ఊరూ వాడా మిన్నంటిన రైతుబంధు సంబురాలు
చెన్నూర్ నుంచి క్యాతనపల్లి మున్సిపాలిటీ వరకు 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
45కిలో మీటర్లు స్వయంగా ట్రాక్టర్ నడిపిన సుమన్
వర్షంలో తడుస్తూ ఉత్సాహంగా ముందుకు..
‘జై కేసీఆర్’ నినాదాలతో మార్మోగిన రహదారులు
పాల్గొన్న ఎమ్మెల్సీవిఠల్, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి
తెలంగాణలో పండుగలా వ్యవసాయం : విప్ సుమన్
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/చెన్నూర్/ రామకృష్ణాపూర్, జనవరి 12: పటాకుల మోతలు.. డప్పుల చప్పుళ్లు.. రైతులు, నేతల నృత్యాలు.. జై రైతుబంధు.. జైజై కేసీఆర్.. నినాదాలతో ఊరూవాడా మారుమోగింది. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని కర్షకుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో 500పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. చెన్నూర్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి ర్యాలీ ప్రారంభించగా, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని అమ్మగార్డెన్ వరకు సాగింది. విప్ సుమన్ స్వయంగా 45 కిలో మీటర్లు ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపారు.
రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం చెన్నూర్ నియోజకవర్గ కేంద్రం నుంచి మంచిర్యాల వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు 500పైగా ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. చెన్నూర్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి ఆయన ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించగా, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి సాయంత్రం 6 గంటలకు చేరుకున్నది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్వయంగా 45 కిలో మీటర్లు ట్రాక్టర్ నడిపి కర్షకులు, నేతల్లో ఉత్షాహం నింపారు. ఊరూరా రైతులు ఘన స్వాగతం పలికారు.
పటాకులు కాల్చుతూ.. డప్పుల చప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. అక్కడక్కడా వర్షం పడగా.. తడుస్తూనే ముందుకు కదిలారు. జై రైతు బంధు.. జైజై కేసీఆర్.. నినాదాలతో వాడలన్నీ మారుమోగాయి. వీధులన్నీ గులాబీమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి అమ్మగార్డెన్స్లో రైతుబంధు వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది మొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ దండే విఠల్‌ను నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తిప్పని లింగయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతుబంధు సమితి నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో పండుగలా వ్యవసాయం
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండుగలా సాగుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పలు చోట్ల మాట్లాడారు. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో తెలంగాణ రైతుల కష్టాలను చూసి అప్పట్లో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం ప్రారంభించి సాధించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రైతులు పెట్టుబడికి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి ఎకరాకు రూ. 5 వేల చొప్పున సాయమందిస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను బాగు చేయించి సాగు నీటి ఇబ్బందులను తొలగించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ చేసి వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్ పర్చన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నాల్లాల ఓదెలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.