అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 11 : అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో 178 ఎకరాల్లో పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీతో కలిసి బాటసింగారం లాజిస్టిక్ పార్కులో 11 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గడ్డిఅన్నారం తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను పరిశీలించారు. దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసిన వసతుల వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడలో 178 ఎకరాల్లో పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన గడ్డిఅన్నారం తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, అహ్మద్ బలాల, జాఫర్ హుస్సేన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, ఎస్ఈ లక్ష్మణ్‌గౌడ్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో పేదలకు ఉచితంగా వైద్య చికిత్సలందించాలనే లక్ష్యంతో నూతన అత్యున్నత సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కోహెడ మార్కెట్ నిర్మాణానికి దసరా పండుగనాడు మూహుర్తం నిర్ధారణ చేశామన్నారు. బాటసింగారంలో తాత్కాలికంగా 11 ఎకరాల్లో పండ్ల మార్కెట్లో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. పార్కింగ్, రహదారులతోపాటు కోల్డ్ స్టోరేజ్ వంటి వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. కోహెడ మార్కెట్‌కు వెళ్లే వరకు బాటసింగారంలో వ్యాపారులకు వసతుల లేమి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఆహ్లాదకర వాతావరణంలో మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యేల విజ్ఞప్తి, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు, వర్తకులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని హామీనిచ్చారు. అవుటర్ సమీపంలో ఉండడంతో తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా మార్కెట్‌కు సులువుగా చేరుకోవచ్చన్నారు. పండ్లు పండించే రైతులు, వర్తకులకు ఇబ్బందులు కలుగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పద్మహర్ష, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కిషన్‌గౌడ్, రమేశ్, కొండల్‌రెడ్డి, రవీందర్, అనీల్‌చౌదరి, కృష్ణమాచారి, లాజిస్టిక్ పార్కు మేనేజర్ గురుపాదం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు జగదీశ్, చక్రవర్తిగౌడ్, లక్ష్మారెడ్డి, గౌరీశంకర్చారి, వెంకట్‌రెడ్డి, రాధాకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రులు
మండలంలోని ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం తెలంగాణ స్టోన్ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందించిన అంబులెన్స్‌ను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. పేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకు వచ్చి మండలానికి ఉచితంగా అంబులెన్స్ అందజేసిన స్టోన్ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్‌ను అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందారెడ్డి, ఓనర్ కొండయ్య, సభ్యులు, నాయకులున్నారు.