కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, అక్టోబర్ 11 : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణికి ప్రజలు వివిధ రకాల సమస్యలు వస్తుంటాయని వాటిని త్వరగా పరిష్కరించి నివేదిక అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కరిస్తే సమస్యలు పెండింగ్లో ఉండవన్నారు. ప్రతి నెలా రెండో మంగళవారం మండలాల వారీగా రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని(పీసీపీసీ) విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని అందుకు ఎజెండా తయారు చేసుకొని సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో చైల్డ్లేబర్, బాల్యవివాహాలు, పోక్సోకేసులపై చర్చించాలని ఆదేశించారు. కమిటీ సమావేశంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాల్లో డ్రాఫ్అవుట్ అయిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.అంగన్వాడీ పాఠశాలల్లో ఉండే పిల్లల్లో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, అందరికీ బాలామృతం, పౌష్టికాహారం అందిస్తున్నారా, న్యూట్రిషన్ పరంగా చేపట్టిన చర్యలపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ కోరారు. పాఠశాలల్లో రక్తహీనత కలిగి ఉన్న పిల్లలను గుర్తించి వారికి మాత్రలు ఇవ్వాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు, గుడ్ల వంటి పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో సిరాజుద్ధీన్ను ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ వీసీపీసీ కమిటీలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ,వార్డు సభ్యులు అందరూ కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఈ కమిటీలో పాల్గొంటారన్నారు. అనంతరం ప్రజావాణికి ఫిర్యాదులు స్వీకరించగా మొత్తం 70 ప్రజా ఫిర్యాదులు వచ్చాయని అందులో ఎక్కువగా భూ సంబంధమైన సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపుతామని వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.