ఎస్పీ రంజన్త్రన్ కుమార్
గద్వాల న్యూటౌన్, అక్టోబర్ 11: మహిళల భద్రతే ధ్యేయంగా పోలీస్‌శాఖ పనిచేస్తున్నదని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ బాలికల జూనియర్ కళాశాలలో మహిళా సాధికారత, మహిళల హక్కులు, మహిళల ప్రాధాన్యత తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో లింగ వివక్ష లేకుండా సమానంగా చూస్తున్నారని అందుకు అనుగుణంగా మన ఆలోచన విధానం మార్చుకోవాలన్నారు. యుక్త వయస్సులోనే తల్లిదండ్రులను వదిలి ప్రేమ వ్యామోహంలో పడి మంచి భవిష్యత్‌ను కోల్పోవద్దన్నారు. మహిళల కోసం షీటీమ్స్, సఖి సెంటర్ ఏర్పాటుతోపాటు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలి పారు. మహిళలు వేధింపులకు గురైనప్పుడు షీటీం నెం బర్ 7993131391కు లేదా డయల్ 100కు కాల్ చేసి సాయం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీడబ్ల్యూసీ సభ్యుడు జయభారతి, బాలరక్ష భవన్ కోఆర్టినేటర్ హేమలత, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నర్సింహ, పట్టణ రెండో ఎస్సై రమాదేవి పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
పోలీసుస్టేషన్ల పరిధిలోని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 6 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌కు ఫిర్యాదులు అందజేశారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు.