మరింత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు
పలు సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 10 : అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లు, పలు సంఘాలకు నిర్మించే ఆత్మగౌరవ భవనాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. త్వరలో స్థలాలను సేకరించి నిర్మాణాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్నిరంగాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే ముందుకెళ్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు ఆదివారం మంత్రి జగదీశ్‌రెడ్డి అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఇతర అధికారులతో కలిసి స్థలాల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జిల్లా కేంద్రంలో మొదలు పెట్టిన మెడికల్ కళాశాల భవనం, సమీకృత భవన నిర్మాణాల సముదాయాలతోపాటు ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికే సూర్యాపేట నియోజక వర్గంలో పూర్తయ్యి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయగా, అదనంగా మరికొన్ని నిర్మించేందుకు నియోజకవర్గ పరిధిలోని కేసారంలో స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యాపేట పట్టణంలో ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణాలకు స్థల సేకరణ జరుపాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.