ఆత్మకూరు, అక్టోబర్ 10: ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉవ్వెతున్న ప్రవహిస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతంగా చేరుకుంటున్నది. శనివారం నుంచి స్థిరంగా కొనసాగుతున్న వరద ఆదివారం సైతం దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో 16గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 66,010 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఆయకట్టుకు, తాగునీటి పథకాలకూ నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150, భీమా ఎత్తిపోతలు-2కు 750, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 41,009 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 12యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుంది. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6యూనిట్ల ద్వారా 4.844 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 271.215 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.29మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 295.570 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 9.111 టీఎంసీలు నిల్వ ఉన్నది. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,634 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.
టీబీ డ్యాంకు వరద..
అయిజ, అక్టోబర్ 10: కర్ణాటకలోని ఎగువ ప్రాంతం లో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 3 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 4,605 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 30,733 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 20,768 క్యూసెక్కులు ఉన్నది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.586 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ, ప్రస్తుతం 1632.93 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
శ్రీశైలం @ 884.40 అడుగులు
శ్రీశైలం, అక్టోబర్10: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. జూరాల నుంచి 86,730 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 39,914 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 75,504 క్యుసెక్కులు, హంద్రి నుంచి 117క్యూసెక్కులు మొత్తం 2,02,265 క్యుసెక్కుల వచ్చి చేరగా రిజర్వాయర్‌కు 1,68,987 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం నుంచి రెండు గేట్ల ద్వారా 55,600క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 33549, కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 23135 క్యూసెక్కుల వరద దిగువన సాగర్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగుల నీటి నిల్వ ఉన్నది.
తెరుచుకున్న ఆటోమెటిక్ సైఫన్లు
మదనాపురం, అక్టోబర్ 10: మండలకేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం గాలి పీడనం ద్వారా నాలుగు ఉడ్ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్ తెరుచుకొని రెండు గంటలపాటు దిగువకు నీరు విడుదలైనది. మదనాపురం రైల్వేగేటు సమీపంలో మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొత్తకోట-ఆత్మకూరు పట్టణాలకు మూడు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించిన రామన్‌పాడు ప్రాజెక్టు అధికారులు, రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ రెనాల్రెడ్డి తెలిపారు.
కోయిల్‌సాగర్ రెండు గేట్ల ద్వారా..
దేవరకద్రరూరల్, అక్టోబర్ 10: మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు ఆదివారం ఎగువ నుంచి 1400 కూసెక్కులు చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా 1400క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 32.6అడుగులు(2.27 టీఎంసీలు) కాగా, వచ్చిన నీటిని వదులుతున్నారు.