గద్వాల న్యూటౌన్, అక్టోబర్ 10 : గుర్తుతెలియని దుండగులు ఒకేసారి ఆరు దుకాణాల్లో చోరీకి యత్నించి రెండు దుకాణల్లో చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. షాపుల నిర్వాహకులు, పోలీసుల కథనం ప్రకారం గద్వాల పట్టణంలోని రాజీవ్‌మార్గ్‌లో ఉన్న బిగ్‌సీ మొబైల్ దుకాణంతోపాటు అదే కాంప్లెక్స్‌లో ఉన్న సెలెక్ట్ మొబైల్ షోరూం, ఇన్సూరెన్స్ దుకాణం, లక్ష్మీ ట్రేడర్స్ ఐడియా సిమ్ పాయింట్, అక్టోపస్ హోంలోన్తోపాటు మరో రెండు దుకాణాలు ఉన్నాయి. ముందుగా పై అంతస్తులో ఉన్న ఇన్సూరెన్స్ కార్యాలయంలో రూ. 80వేల నగదును అపహరించారు. అక్కడి నుంచి కింది ఫ్లోర్‌లోకి వచ్చి గడ్డపారతో ఐడియా సిమ్ పాయింట్ షట్టర్ తాళం పగులగొట్టి అందులో ఉన్న రూ. 15,800 నగదును అపహరించారు. ఆ తర్వాత సెలెక్ట్ మొబైల్, టీవీ స్టోర్ షట్టర్ తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం పక్కనే ఉన్న బిగ్‌సీ మొబైల్‌స్టోర్ షట్టర్ తాళం,అద్దాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో ఇక్కడి నుంచి హైదరాబాద్‌లో బిగ్‌సీ బ్రాంచ్ కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలను గమనించి దొంగలు ప్రవేశించినట్లు గుర్తించి స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ తరుణంలో పోలీసులు రావడంతో దొంగలు పరారయ్యారు. వెంటనే గద్వాల పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, ట్రైనీ ఎస్సై శైలేంద్రకుమార్ ఘటనా స్ధలానికి చేరుకొని క్లూస్‌టీం ద్వారా దుండగుల వేలిముద్రలను సేకరించారు. అలాగే డాగ్స్క్య్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు.