
దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలోనూ తనిఖీలు
సుల్తాన్‌బజార్ / సైదాబాద్, జనవరి 10: ఉస్మానియా, మలక్‌పేట ఏరియా ఆసుపత్రులలో ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉస్మానియా దవాఖానలోని క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి వచ్చి రోగులకు అందిస్తున్న సేవలు, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్రి వైద్యులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా దవాఖానలో అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి వైద్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, కార్డియాలజీ హెచ్‌వోడీ డాక్టర్ ఇమాముద్దీన్, ఆర్థోపెడిక్ విభాగం హెచ్‌వోడీ జి.రమేష్‌లు అరణ్య భవన్లో మంత్రి హరీష్‌రావును కలిశారు. ఉస్మానియాలో అందుతున్న సేవలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మలక్‌పేట ఏరియా హాస్పిటల్‌ను మంత్రి హరీశ్ రావు తనిఖీ చేశారు. దవాఖాన మొత్తం కలియ తిరిగారు. 81 పడకల సామర్ధ్యంతో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డుతో పాటు 13 పడకల పిల్లల వార్డును, వార్డులో ఉన్న ఆక్సీజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి ఆరా తీశారు. దవాఖానలో పారిశుద్ధ్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. టాయిలెట్స్‌ను సైతం పరిశీలించి శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి వచ్చినట్లు తెలుసుకున్న సూపరింటెండెంట్ త్రిలోక్ శ్యాం హుటాహుటీన దవాఖానకు చేరుకున్నారు. కొన్ని వైద్య పరికరాలు బయటే ఉండటంపై మంత్రి దవాఖాన సూపరింటెండెంట్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.