ఖైరతాబాద్ : ‘తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడం సంతోషకరమైన విషయమని ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. చింతలబస్తీలోని యూపీహెచ్సీ కేంద్రాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటితో కలిసి సందర్శించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రాలకు అవసరం మేరకు టీకాలను పంపిస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రధానంగా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివని, ఇంటింటికి వెళ్లి టీకాలు వేయడంలో సఫలీకృతులయ్యారన్నారు .
ఫలితంగా వంద శాతం ఫలితాలను సాధించామని, రెండో డోసులోనూ 65 శాతం పూర్తయ్యిందని, వంద పర్సెంట్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఫ్రంట్‌లైన్ వర్కర్స్, వృద్ధులకు బూస్టర్ డోసులు వేయాలని, చిన్నారులకు వేసే వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం విజయవంతంగా చేయాలని కోరారు.
ఒమిక్రాన్‌తో పాటు ఎలాంటి వేరియెంట్లనైనా ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. ఆమె వెంట వైద్యాధికారి డాక్టర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.