
టీనేజర్లందరికీ కరోనా టీకా..
ఉమ్మడి బాలానగర్‌లో.. టీకా లక్ష్యం 15 వేలు
వారం రోజుల్లో 12 వేల మందికి టీకాలు
కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 9 : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలవుతున్నది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టగా 95శాతం ప్రజలు రెండు డోస్‌లు వేసుకున్నారు. కరోనా టీకాతోనే సంపూర్ణ రక్షణ ఉంటుందని టీకా వేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించినా నేటికి వందశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు. కాగా.. గత వారం రోజుల నుంచి కౌమార దశలో ఉన్న యువతీ యువకులకు టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. ఓవైపు 18 సంవత్సరాలు పైబడిన వారికి రెండు డోస్‌ల టీకాలు వేయడంతో పాటు 15 నుంచి 18 సంవత్సరాల యువతకు టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
ఆరు రోజుల్లో 12వేల టీకాలు..
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో సుమారు పది లక్షల మంది జనాభా ఉండగా అందులో 18 ఏండ్లు పైబడిన వారు ఏడు లక్షలు ఉన్నట్లు గణాంకాలున్నాయి. 15 నుంచి 18 సంవత్సరాల వయసులోపు వారు జంట సర్కిళ్లలో పదిహేను వేలకు పైగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమన్వయంతో టీనేజర్లకు టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 3 నుంచి చేపట్టిన టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 12వేలకు పైగా యువజనులకు టీకాలు వేశారు. ఉమ్మడి బాలానగర్ మండలం ఆరోగ్య కేంద్రాల పరిధిలో వందశాతం టీకా లక్ష్యాన్ని చేరుకునేందుకు కళాశాలలు, పాఠశాలల్లో కౌమారులకు టీకాలు వేశారు. పదిహేను సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు వేయడంతో పాటు పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని కోరుతున్నారు.