
ఉత్సవాలకు ముస్తాబైన మల్లికార్జున స్వామి దేవాలయం
సైదాబాద్, జనవరి 9: జంటనగరాల్లోనే ప్రసిద్ధి చెందిన సైదాబాద్ కరణ్‌బాగ్ కాలనీలోని మల్లికార్జున దేవాలయం (పుట్టమన్ను)లో మల్లన్న కల్యాణోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుండటంతో ఈ మహోత్సవానికి భక్తులు భారీగా తరలి రానున్నారు. కొమరవెల్లి, ఐనవోలు ప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి కరణ్‌బాగ్ కాలనీలోనూ ఉండడంతో భక్తులు ఆరాధ్యదైవంగా భావిస్తున్నారు.
కొమరవెల్లి లాగే పూజా విధానం
కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ ఇక్కడ కొనసాగుతున్నాయి. దీంతో అక్కడికి వెళ్లలేని భక్తులందరూ ఇక్కడే స్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు. మూడు రోజులపాటు జరిగే కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.
సర్వాంగ సుందరంగా..
కల్యాణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో జయంతి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒగ్గు పూజారి మారయ్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి:
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్లన్న కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాస్ రావు, ఈవో జయంతి తెలిపారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే కల్యాణోత్సవాలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గడ్డం నందు, పొట్లపల్లి విషువర్ధన్రావు, కొశిక కృష్ణ, ఏనుగు పంకజారెడ్డి పాల్గొన్నారు.