రేపు మహానగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్
గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్ష
రెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ
టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం
వరంగల్, నవంబరు 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): చారిత్రక వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఓరుగల్లుకు వస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం, టెక్స్టైల్ పార్క్ పనుల పురోగతిపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సకల హంగులతో నిర్మించిన టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనుండగా, అధినేత రాక కోసం పార్టీ నేతలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
సీఎం కేసీఆర్ మరోసారి వరంగల్ నగరానికి వస్తున్నారు. చారిత్రక మహానగరం సమగ్రాభివృద్ధి కోసం అవసరమైన పనులు చేపట్టడమే ప్రధాన ఉద్దేశంగా సీఎం పర్యటన సాగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమీక్షించనున్నారు. వరంగల్ నగరంతోపాటు ఉమ్మ డి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లోని రోడ్ల అభివృద్ధిపైనా చర్చించనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల విజ్జప్తు లు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, గ్రేటర్ వరంగల్‌లో రవాణా కు, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వే ట్రాక్‌లపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మా ణం, ఇతర అభివృద్ధి అంశాలపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు మంజూ రు చేయనున్నారు. మహానగరంలోని ఇంటర్నల్ రింగ్‌రోడ్డు పూర్తి చేసేందుకు, అంతర్గత రోడ్ల నిర్మాణం, విస్తరణ, టెక్స్టైల్ పార్ పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.
సకల హంగులతో తెలంగాణ భవన్
టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చే ప్రక్రియలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టిన పార్టీ సంస్థాగత బలోపేత ప్రక్రియ చివరి దశ కు చేరింది. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయ (తెలంగాణ భవన్) నిర్మాణం చేపట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయా న్ని ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించారు. ఒక భవ నం, పెద్ద సమావేశ మందిరం, కిచెన్, సర్వెంట్ క్వార్టర్లు, గార్డెనింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రధానభవనంలో కార్యాలయ ఇన్చార్జి చాంబర్, కంప్యూటర్ రూం, వెయిటింగ్‌హాల్ ఉన్నాయి. పక్కన 500 మంది ఒకేసారి సమావేశమయ్యే లా పెద్ద హాల్ ఉంది. జిల్లా పార్టీ ఆఫీసు లు జరిగే సమావేశాలకు వచ్చే వారికి ఆహారం అందించేందుకు వీలుగా కిచెన్ రూం, ఆఫీసులోని వారి కోసం సర్వెంట్ రూం నిర్మించారు. కార్యాలయ ఆవరణ అంతా చెట్లతో ఆహ్లాదం పంచుతున్నది.