అధైర్య పడద్దు.. మీ వెంట నేనుంటా..
మీ అందరికీ అండగా ఉంటా
నష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తాం
శాంతినగర్వాసులకు అమాత్యుడి భరోసా
మోకాళ్లలోతు నీటిలో పర్యటన
సిరిసిల్ల, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల;వరద బాధితులకు ‘నేనున్నాంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. భారీ వర్షాలతో సిరిసిల్ల అతలాకుతలం కాగా, బుధవారం జిల్లాకేంద్రంలో పర్యటించి భరోసా ఇచ్చారు. ముందుగా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తులో ఎలాంటి వరదలు వచ్చినా ప్రజలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని, బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత శాంతినగర్‌లోని 2,13,14 వార్డులను పరిశీలించారు. మోకాళ్లలోతు నీటిలో తిరుగుతూ, వరద తీవ్రతను పరిశీలించారు. ప్రజల గోడును విని, ‘అధైర్య పడద్దు.. మీ అందరికీ అండగా ఉంటా’నని భరోసా ఇచ్చారు. నష్టపోయిన అందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలతో కార్మికక్షేత్రం అతలాకుతలం కాగా, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. వరద ప్రభావం, సహాయక చర్యలపై కలెక్టరేట్లో సమీక్షించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు జలమయమైన శాంతినగర్‌లోని 2,13,14 వార్డుల్లో పర్యటించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మోకళ్ల లోతు నీటిలో తిరుగుతూ, మహిళలు, వృద్ధులను పలుకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరదబాధితులు తమ గోడును వెల్లబోసుకోగా, ‘అధైర్య పడద్దు.. మీకు నేనున్నా..’ అని అభయమిచ్చారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు. తమ సాంచాలు మునిగిపోయి పనికిరాకుండా పోయాయని నేత కార్మికులు విన్నవించగా, సర్వే చేసి నష్టపోయిన వారికి పరిహారం అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వానలు ఇంకా రావని, ఒకవేళ వచ్చినా అందరం కలిసి ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడవద్దని శాంతినగర్వాసులకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులతోపాటు స్థానిక పోలీసులు అందించిన సేవలను అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టిన డీఆర్ఎఫ్ టీంను అభినందించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ జింద కళ, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు అడ్లగట్ట మురళి, జాగీరు శైలు, మాధవి, దిగంబర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎమ్మార్వో విజయ్ ఉన్నారు.