వివిధ రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కార్మికులు
భవన, టెక్స్టైల్స్, రైస్‌మిల్లుల్లో మెరుగైన అవకాశాలు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) :నాడు.. ఆంధ్ర ప్రభుత్వాల తీరుతో ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన దుస్థితి.. నేడు.. వలస వెళ్లిన వారు వాపస్ రావడమే కాదు.. ఇతర రాష్ర్టాల కార్మికులు సైతం వచ్చి తీరొక్క పని చేసుకునేలా మారిన పరిస్థితి.. ఒకప్పటి కరువు ప్రాంతమైన సిరిసిల్ల ఇప్పుడు జీవనోపాధికి కేరాఫ్‌గా మారింది. కాళేశ్వర జలాలతో ధాన్యం దిగుబడి పెరుగడంతో రైస్‌మిల్లుల.. బతుకమ్మ చీరెలతో టెక్స్టైల్స్, జిల్లాల పునర్విభజనతో భవన నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారు వాపస్ రావడమే కాకుండా.. వివిధ రాష్ర్టాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జిల్లాకు వస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన వారు మెరుగైన ఉపాధి పొందుతున్నారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఉపాధి లేక ఇక్కడి వ్యవసాయ రైతులు, కూలీలు, నేతన్నలు వలసబాట పట్టారు. పొట్టచేతపట్టుకుని వెళ్లినా అక్కడ కూడా ఉపాధి కరువై ఎంతో మంది ఉసురు తీసుకోగా, వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయి. నాడు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్న ఇక్కడి ప్రజలకు స్వరాష్ట్రంలో మెరుగైన ఉపాధి లభిస్తుండడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సిరిసిల్లను అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. రూ.2500 కోట్లతో బతుకమ్మ చీరెలు, క్రిస్మస్, రంజాన్, యూనిఫాం దుస్తుల తయారీతో నేతన్నలకు చేతి నిండా పనికల్పించారు. కాళేశ్వర జలాలతో సాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. భూగర్భ జలాలు 6 మీటర్ల పైకి పెరగడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ రంగాల్లో పని చేసిన వ్యవసాయ కూలీలు తిరిగి సాగు పనుల్లోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు తోడుగా వ్యవసాయం, టెక్స్టైల్ రంగాలు వృద్ధి చెందడంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఫలితంగా భవన నిర్మాణాలు పెరిగాయి. దీంతో కార్మికులకు డిమాండ్ ఏర్పడింది. ఉపాధి మెరుగవడంతో ఇతర రాష్ర్టాల కార్మికులు ఇక్కడికి వలస బాటపట్టారు. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, చత్తీస్ఘడ్ రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో గతంలో ఆంధ్రా మేస్త్రీలు, కూలీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
10 వేల మంది వలస కార్మికులు
జిల్లాలోని కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు పది వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్క భవన నిర్మాణ రంగంలోనే 3 వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, కార్యాలయాలు, కళాశాలలు ఇలా ప్రతి నిర్మాణంలో ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలే ఉన్నారు. ఇక టెక్స్టైల్స్, ఇటుక బట్టీలు, రైసుమిల్లులు, భవన నిర్మాణ రంగంలో 7 వేల మంది వరకు పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ రంగంలో రోజు ఒక్కో కూలీ రూ.700ల నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. అక్కడి రాష్ర్టాల్లో కూలి రేట్లు తక్కువ ఉన్నందుకే తెలంగాణకు వస్తున్నట్లు కూలీలు చెబుతున్నారు.
జోరందుకున్న భవన నిర్మాణ రంగం
ప్రస్తుతం జిల్లాలో భవన నిర్మాణ రంగం జోరందుకుంది. ఇళ్ల నిర్మాణాలు పెరగడం, అందులో కొందరు నయా డిజైన్ల వైపు మొగ్గుచూపుతుండడంతో టైల్స్, మార్బుల్, ఫర్నీచర్, సీలింగ్ వంటివి అమర్చే కార్మికులకు డిమాండ్ పెరిగింది. ఇందులో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులకు నైపుణ్యం ఉండడంతో అక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నారు. ఇందులో ఒక్కో కార్మికుడు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తున్నారు.
రూ.30 వేలు సంపాదిస్తున్న
మా ఊరిలో ఉపాధి లేక ఇక్కడికి వల వచ్చాం. మమ్మల్ని టేకేదార్ (కాంట్రాక్టర్) ఒప్పందంతో తీసుకువచ్చిండు. భవన నిర్మాణాల్లో పని చేస్తున్న. నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న. ఇంకా మా ఊరి నుంచి 200 మంది ఇక్కడకు వచ్చి పని చేసుకుంటున్నరు. సిరిసిల్లలో ఉపాధికి భరోసా దొరికింది.