నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు
ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి ప్రారంభం
మరో శబరిపీఠంగా మద్దిమడుగు ఆలయం
లక్షల సంఖ్యలో దీక్ష స్వీకరించనున్న స్వాములు
అచ్చంపేట, నవంబర్ 5 : నల్లమల ప్రాంతం మద్దిమడుగు క్షేత్రంలో వెలసిన పబ్బతి ఆంజనేయస్వామి మాలధారణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్వాములు మాలధారణ చేపట్టనున్నారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. పిలిస్తే పలికే దైవంగా భక్తులు ఆరాదీస్తారు. నల్లమల కొండల్లో ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తున్నది. ఈ నదికి పడమర నుంచి దుందుభీ నది కలిసేచోట దుందుభేశ్వరం అనే పురాణ క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రానికి పడమరన 12 కిలోమీటర్ల దూరంలో మద్దిమడుగు అనే రేవు పట్టణం మూడో శతాబ్దంలో పెద్ద కోట నిర్మించారు. కోటకు నాలుగు బురుజులు, దక్షిణాన ఒక బురుజు, నైరుతిలో ఎతైన ప్రాకారం, కోట పైన రాజు ఉండేలా నిర్మించారు. ఈశాన్య ప్రాంతంలో స్వామి వారు పుట్ట నుంచి బయటకు వచ్చి వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. చుట్టూ నాలుగు అడుగులు, ఒక భుజం ఎత్తు కలిగిన ప్రాకారపు గోడలు ఉన్న చిన్న ఆలయంలో వెలిసిన మద్దిమడుగు క్షేత్రపాలకుడిగా పేర్కొంటారు. కాలక్రమేణా మద్దిమడుగు రేవు పట్టణంగా రూపాంతరం చెందింది. రాజుల కాలంలో వర్తక వ్యాపారాలు కొనసాగాయి. అనేక మార్పులు చెంది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. చెంచులు, గిరిజనులు పండ్లు, పాలు, తేనె నైవేద్యంగా సమర్పించుకొని అనునిత్యం స్వామివారిని ఆరాధించడం ప్రారంభించారు. పశువుల కాపరులు స్వామిని ఆవు పాలు, నెయ్యితో అభిషేకించి రొట్టెలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టేవారు.
1992లో మాలధారణ షురూ..
1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో 15 మందితో మాలధారణ ప్రారంభించారు. జయరాం స్వామి గురుస్వామిగా మాలధారణ చేశారు. అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాముల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, గుంటూరు, ప్రకాశం, కర్నూల్, హైదరాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల పరిధిలో స్వాములు పెద్ద ఎత్తున మాలధారణ చేపడుతున్నారు. ఈనెల 6వ తేదీన అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం క్షేత్రంలో కొండకింద బోగమహేశ్వరం ఆంజనేయస్వామి ఆలయంలో మాలధారణ ప్రారంభం కానున్నది. 7న హనుమాన్ దీక్షపీఠం, లక్ష్మీనగర్ సాగర్రోడ్డు, హైదరాబాద్.., 8న దుర్గాభవానీ మాత దేవాలయం లింగాల, అచ్చంపేట, దేవరకొండ, నల్లగొండ, సూర్యాపేట, 9న మాచర్ల, గుత్తికొండ, కారంపుడి, గుంటూరు ప్రాంతాల్లో మాలధారణ చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు అర్ధమండలి దీక్ష (21 రోజులు)ను హనుమత్ దీక్షా పీఠం హైదరాబాద్లో చేపట్టనున్నారు. డిసెంబర్ 12న మార్గశిర పౌర్ణమి సందర్భంగా మద్దిమడుగు ఆలయంలో హనుమత్ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి, మాలవిరమణ నిర్వహించనున్నారు.
పాటించాల్సిన నియమాలు..
కరోనా నేపథ్యంలో స్వాములందరూ ఒకే దగ్గర ఉండొద్దు.
ఒక చోట ఒక్కరు, ఇద్దరు మాత్రమే ఉండాలి.
కరోనా నిబంధనల మేరకు పూజలు చేయాలి.
దీక్షా కాలం వరకు మాల విసర్జించొద్దు. గురుస్వామి చేతనే మాలను ధరించాలి.
కాషాయపు రంగు దుస్తులు ధరించాలి.
ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. సింధూరం ధరించి,
ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి.
దీక్షా కాలం ముగిసే వరకు చెప్పులు ధరించొద్దు.
ఇతరులను, స్త్రీలను స్వామి అని సంబోధించాలి.
మనస్సులో స్వామియే శరణం.. ఆంజనేయ హనుమంత అనుకుంటూ ఉండాలి.
దీక్షా కాలం ముగిసే వరకు గడ్డం చేసుకోవడం, గోళ్లు తీసుకోవడం చేయొద్దు.
దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.
ప్రతి స్త్రీని (భార్యతో సహా) మాతృభావంతో చూడాలి. మనస్సులో కూడా
చెడు భావం రానీయ్యొద్దు.
శాఖాహారం మాత్రమే భుజించాలి. కాఫీ, టీ, మత్తు పానీయాలు సేవించొద్దు.
రోజుకు ఒక్క పూట మధ్యాహ్నం మాత్రమే భుజించాలి. ఒకవేళ ఉదయం
నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుంటే రాత్రికి భోజనం చేయొచ్చు.
రాత్రి పూట అల్పాహారం తీరుకోవాలి.
మంచం, పరుపులపై కాకుండా.. నేలపై టవల్ పరుచుకొని నేలపై మాత్రమే
పడుకోవాలి. పగలు నిద్రించొద్దు.
జూదం ఆడడం, నాటికలు, ఇతర వినోద కార్యక్రమాలు చూడొద్దు.
దీక్షకాలంలో శవం ఎదురైతే స్నానం చేసి.., స్వామివారి శరణుఘోష పఠించాలి.
స్వాములు స్వయంగా వంట చేసుకోవాలి.
దీక్ష ముగిసేలోగా మూడు సార్లు ఇతర స్వాముల ఇంటికి భిక్షకు వెళ్లాలి.
తమ శక్తి కొలది కనీసం ఒకరు లేదా ఇద్దరు స్వాములకు భిక్ష పెట్టాలి. లేకుంటే
నైవేద్యం పెట్టి ప్రసాదం కొంత మంది స్వాములకు అయినా పంచాలి.
పోపు, మసాలతో కూడిన ఆహారం భుజించొద్దు.
రోడ్లపై నిలబడి ఆహారం తినవద్దు.
దురదృష్టవశాత్తు కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే మాలను తీసి ఆంజనేయ
స్వామి పటానికి వేయాలి. మరుసటి ఏడాది గురుస్వామితో మాల ధరించాలి.
దీక్షా కాలంలో పవిత్ర దేవతా గ్రంథాలు, హనుమాన్ చాలీసా చదవాలి.
మలవిసర్జనకు వెళ్తే.. దుస్తులు ఉతికి స్నానం చేయాలి.