ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతటా సందడే.. సందడి
వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు
నేడు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు
రంగారెడ్డి, జనవరి 5, (నమస్తే తెలంగాణ) ;ఏరువాకలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన రైతుబంధు.. అన్నదాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేల కోట్లకుపైగా సాయం జమ కానున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు పండుగలా సాగుతున్నాయి. బుధవారం ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పంట పొలాల్లో రైతుబంధు, కేసీఆర్ పేర్లతో వరి నాట్లు వేసి, ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. రైతు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు రైతు వేదికల అలంకరణ, పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించగా, నేడూ ఈ పోటీలు కొనసాగనున్నాయి. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనగా రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎనిమిది విడుతల్లో అందిన పెట్టుబడి సాయం మొత్తం ఈ నెల 10వ తేదీతో రూ.50 వేల కోట్లకు చేరుతుండటంపై రైతుబంధు వారోత్సవాలను నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఊరూరా.. రైతుబంధు వారోత్సవాలను పండుగలా నిర్వహిస్తున్నారు. మూడో రోజైన బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఉప్పరిగూడ రైతువేదికలో జరిగిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని అన్నారు. అదేవిధంగా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడెం గ్రామంలో జరిగిన రైతుబంధు వారోత్స వాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో వారోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని రైతు గఫార్ పొలంలో రైతుబంధు, కేసీఆర్’ అంటూ ఆంగ్ల అక్షరాల్లో వేసిన వరి నాట్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిశీలించి మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు బూర్గుపల్లిలో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో పలువురు రైతులను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనం ద్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పండుగగా రైతుబంధు పథకం నిలిచిందని కొనియాడారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. నేడు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన, ముగ్గుల పోటీలు జరుగనున్నాయి.
రూ. 499.45 కోట్లు..
ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5,03,888 మంది రైతులకుగాను రూ. 499.45 కోట్లను అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. బుధవారం ఒక్క రోజే రూ.17.84 కోట్లు 5967 మంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
-రంగారెడ్డి, జనవరి 5, (నమస్తే తెలంగాణ)/పరిగి