ఉమ్మడి జిల్లాలో అంబారన్నంటేలా రైతుబంధు వారోత్సవాలు
రంగవల్లులు వేసి..రాష్ట్ర ప్రభుత్వానికి జైకొట్టిన జనం
వివిధ రకాల ధాన్యాలతో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాల పేర్ల ఆకృతులు ఏర్పాటు
బండెనక బండి కట్టి భారీ ర్యాలీలు , వాడవాడలా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
ఇబ్రహీంపట్నం, జనవరి 7 :రైతుబంధు వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్నదాతలు సంబురాల్లో పాల్గొని సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. శుక్రవారం కాలనీలు, పాఠశాలల్లో రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వడ్లు, పత్తి, మిరపకాయలు, మక్కలు తదితర పంట ఉత్పత్తులను సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ పేర్ల అక్షరాల ఆకృతిలో పేర్చి అభిమానాన్ని చాటారు. పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు తీశారు. రైతుబాంధవుడైన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పాయన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, జనవరి 7 : వికారాబాద్ జిల్లా పరిధిలో శుక్రవారం రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ క్లస్టర్లలో రైతులతో వ్యవసాయాధికారులు ఆత్మీయ సమ్మేళనాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు రైతుబంధు కింద 8 విడుతలుగా విడుదలైన రైతుబంధు పెట్టుబడి సాయం వివరాలు తెలియజేశారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పరిగిలోని మార్కెట్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో వడ్లు, మొక్కజొన్నలతో రైతుబంధు, 50వేల కోట్లు అని అక్షరాల్లో రాసి సంబురాలు చేశారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తలపాగా, నాగలితో రైతుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి కందులతో అభిషేకం చేశారు. అనంతరం ఆదర్శ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, అప్పాయపల్లి, అంగడిరాయచూర్ తదితర గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ఎడ్లబండ్లతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో రైతుబంధు వారోత్సవాల్లో తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు రైతుబంధు అక్షరాల ఆకృతిలో నిలబడి తమ సంతోషం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సంబురాల్లో భాగంగా మూడో రోజు జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులు అందజేశారు. మంచాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ముగ్గులు వేయగా, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తిలకించి బహుమతులను అందజేశారు. షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆమనగల్లు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రైతుబంధు ప్రాముఖ్యతను తెలిపే ముగ్గులను వేశారు. అనంతరం వారికి అధికారులు బహుమతులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలనూ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు రెండు విడుతలుగా పెట్టుబడి సాయాన్ని అందజేయడం వల్ల వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతుబంధుతో లబ్ధిపొందిన ప్రతి రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాసటగా నిలువాలని కోరారు.