8వ విడుత హరితహారానికి రంగం సిద్ధం
నర్సరీలు ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశం
నెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేయాలని సూచన
నల్లగొండ, అక్టోబర్ 1;అటవీ శాతం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాక్రతువు హరితహారం. ఇప్పటికే ఏడు విడుతలను దిగ్విజయంగా పూర్తిచేసి ఊరూవాడకు ఆకుపచ్చ తోరణాలను అల్లిన సర్కారు, ఎనిమిదో విడుతకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో అక్టోబర్ 31 నాటికి నర్సరీలు ఏర్పాటు చేసి బ్యాగుల్లో మట్టి నింపి విత్తనాలు వేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి నర్సరీలోనూ 15వేల మొక్కలు పెంచేందుకు ప్రభుత్వం ఒక్కో నర్సరీకి రూ.3లక్షల రూపాయలను వెచ్చించనున్నది. గతంలో 290 పంచాయతీల్లో ప్రైవేట్ భూముల్లో నర్సరీలను ఏర్పాటు చేసి కిరాయి చెల్లించగా, ఈసారి అన్నిచోట్లా సర్కారు భూములను గుర్తించాలని ఆదేశించడంతో స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది.
అటవీ శాతం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2015నుంచి తెలంగాణకు హరిత హారం పేరుతో ఏటా మొక్కల పెంపకం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా 2.2 కోట్ల మొక్కల చొప్పున గడిచిన ఏడు విడుతలుగా సుమారు 15కోట్ల మొక్కలు నాటించారు. అందులో సుమారు తొమ్మిది కోట్ల మొక్కలు సంరక్షించినట్లు అధికారుల అంచనా. అందులో భాగంగానే ఈ ఏడాది 8వ విడుతగా వన నర్సరీల్లో 15వేల చొప్పున మరో 2.2 కోట్ల మొక్కలు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
ఈ సారి ప్రతి నర్సరీలో 15వేల మొక్కలు
నర్సరీల్లో గతంలో 10వేల మొక్కలు మాత్రమే పెంచగా ఈ సారి మరో ఐదు వేలకు పెంచారు. 10వేల మొక్కలు వచ్చే ఏడాది నాటనుండగా మరో ఐదు వేల మొక్కలను భవిష్యత్ అవసరాల కోసం సంరక్షించనున్నారు. వాటిని ప్రత్యేకంగా పెద్ద సైజు బ్యాగుల్లో నాటించి జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన నాటనున్నారు. అదే విధంగా ఈ సారి సైతం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వనుండగా అందులో ‘కృష్ణ తులసి’ని తప్పని సరి చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది చేసిన ఇంటింటి సర్వేలో తమకు పండ్ల మొక్కలే కావాలని ప్రజలు కోరడం గమనార్హం.
ఒక్కో నర్సరీకి రూ.3 లక్షలు
ప్రభుత్వం ఒక్కో నర్సీరీకి రూ.3లక్షలు వెచ్చిస్తున్నది. బ్యాగులతో పాటు మట్టి, వన సేవక్, మొక్కలు పెరిగే వరకు వాటరింగ్, అంతర్గత పనులకు కావాల్సిన కూలీల వేతనాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఇందులో కూలీల ఖర్చే అధికంగా ఉంటుంది. కూలీల వేతనం ఉపాధి హామీ పథకం ద్వారా అందించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామ పంచాయతీల్లో వన నర్సరీలు ఏర్పాటు చేయనుండడంతో మొత్తంగా రూ.52కోట్లు వెచ్చించనున్నారు. గత ఏడు దఫాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి 15 కోట్ల మొక్కలు నాటగా అందులో సుమారు తొమ్మిది కోట్ల మొక్కలు బతికినట్లు రికార్డులు చెప్తున్నాయి.
సిద్ధంగా ఉన్నాం..
2022లో నిర్వహించే హరిత హారానికి మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రతి నర్సరీలో 10వేల మొక్కలను పెంచగా ఈ సారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో ఐదు వేల మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు కోరుకున్న మేరకు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందిస్తాం.