దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం అమలు
ఆర్థికంగా ఎదుగనున్న పేద దళితులు
అత్యవసర సమయాల్లో రక్షణనిధి వినియోగం
ఈ నెల 5లోపు లబ్ధిదారులను ఖరారు చేస్తాం
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
నియోజకవర్గంలో ముందుగా 100 కుటుంబాల ఎంపిక
ప్రత్యేక ఇంటర్వ్యూలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
‘షాబాద్, ఫిబ్రవరి 1:దళితుల ఆర్థికాభివృద్ధికి దళితబందు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దళితబాంధవుడిగా నిలిచారు.. ఇటువంటి పథకం దేశంలో ఎక్కడా లేదు.. వ్యాపారం చేసుకునేందుకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు అందనుండడంతో వారి దశ మారనున్నది..’ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో 20 యూనిట్ల చొప్పున చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట్ మండలాల్లో 100 మంది లబ్ధిదారులను ఈ నెల 5వ తేదీలోపు ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. మిగిలిన దళితులందరికీ విడుతల వారీగా లబ్ధి చేకూరనున్నదన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేటాయించిన రూ.10 లక్షల్లోంచి రూ.10వేలను తీసి రక్షణ నిధిని ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో వినియోగించనున్నట్లు వివరించారు. దళితుల అభ్యున్యతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేసి సీఎం కేసీఆర్ దళితబాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. దళితబంధు పథకంపై తన క్యాంపు కార్యాలయంలో నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొట్ట మొదటిసారిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే దళితజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొ చ్చి సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ… దళిత బాంధవుడిగా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలోని దళితులందరినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో… ప్రతి గ్రామంలో దళితులందరికీ వారి ఇష్ట ప్రకారం ఎంచుకున్న వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లో లేని పథకం ఇది… రూ. 10 లక్షలను అందిస్తూ దళితుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుపై ఎమ్మెల్యే మాటల్లోనే…
నమస్తే: దళితబంధు పథకంపై మీ అభిప్రాయం…?
ఎమ్మెల్యే : ఒక సాధారణ దళిత కుటుంబం తమ జీవిత కాలంలో రూ. 10 లక్షలను సంపాదించడం కష్టతరమైనది. అలాంటి వారందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండగా నిలవడం సంతోషంగా ఉన్నది. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి పథకం ఎప్పుడూ చూడలేదు. వందకు వందశాతం రాయితీతో రూ.10లక్షలు ఇవ్వడానికి ధైర్యం కావాలి. పేదరికంలో ఇబ్బం ది పడుతున్న దళిత కుటుంబాలను ఈ పథకం ద్వారా ఉన్నత ప్రమాణాలు అందుకునేలా చేయవచ్చు.
నమస్తే: మీ నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇస్తున్నారు. ఏ విధంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తారు…?
ఎమ్మెల్యే: మా నియోజకవర్గానికి వచ్చిన 100 యూనిట్లను అన్ని కోణాల్లో ఆలోచించి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తు న్నాం. నియోజకవర్గంలో చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శం కర్పల్లి, నవాబుపేట్ మండలాలుండగా… మండలానికి 20 యూనిట్ల చొప్పున ఐదు మండలాల్లో 100 యూనిట్ల ఎంపిక చేస్తున్నాం. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇప్పించేందుకు కృషి చేస్తాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. మార్చిలోపు లబ్ధిదారులకు పథకాన్ని అందజేస్తాం.
నమస్తే: లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా…? స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తారా..?
ఎమ్మెల్యే: ప్రభుత్వం ఎంతో మేలును ఆకాంక్షించి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నది. ఈ మొ త్తం ఆయా కుటుంబాలకు చేరాలి. వారి స్వ యం ఉపాధికి అవసరం కావాలన్నది నా లక్ష్యం. ప్రభుత్వ ఆదేశాలతో పాటు స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని దళితబంధు పథకాన్ని అమలు చేస్తా. చేవెళ్ల నియోజకవర్గానికి మొత్తం రూ. 100కోట్లు మంజూరు అవుతాయి.
నమస్తే: మీ రాజకీయ అనుభవంలో దళితబంధు పథకం పోలిన స్కీం ఎప్పుడైనా చూశారా..?
ఎమ్మెల్యే: నా 35 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులను చేపట్టా. కానీ ఎక్కడా ఇలాం టి పథకం అమలు చేసిన దాఖలాలు లేవు. పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రులతోనే ఈ పథకాలు సృష్టించబడుతాయి. పేద వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. అందులో భాగంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆర్థికంగా మనిషి ఎదిగితే సమాజంలో సమానత్వం వస్తున్నది. ఇప్పుడున్న వివక్ష అన్న ది దళితబంధు పథకం ద్వారానే తొలగిపోయే ఆస్కారం ఉంటుంది.
నమస్తే: రక్షణ నిధితో ఎలాంటి ఉపయోగం ఉంది..?
ఎమ్మెల్యే: దళితబంధు పథకంలో ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ. 10వేలు తీసుకొని రక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి ఆర్థికంగా కష్టంవచ్చినా, వ్యా పారంలో నష్టం వచ్చినా ఈ రక్షణ నిధి ఉపయోగపడుతున్నది. లబ్ధిదారులను ఆదుకునేందుకు అవకాశముంటుం ది. రక్షణనిధి ఎంతో భరోసాగా ఉంటుంది. దీని ద్వారా అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేస్తాం.
నమస్తే: లబ్ధిదారులు ఎలాంటి యూనిట్లు కోరుకుంటున్నట్లు మీ దృష్టికి వచ్చింది..?
ఎమ్మెల్యే: లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లబ్ధిదారులు ట్రాక్టర్లు, ఆటోమొబైల్స్, చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, కంప్యూటర్ సెంటర్, దాబాలు, హోటల్స్, మొబైల్స్, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారు. మహిళలు అయితే బ్యాంగిల్ స్టోర్స్, బట్టల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఎంపిక చేస్తున్నట్లుగా మేము గుర్తించాం.