పట్టుదలే ఆయన పెట్టుబడి
కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో..
40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల అధిరోహణ
మంచిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి
జిల్లా అధ్యక్ష పదవితో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1: సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ముందుకు సాగుతున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. పట్టుదల..క్రమశిక్షణ…కమిట్మెంటే ఆయన పెట్టుబడి. రాజకీయాల్లో వ్యూహాలు రచించటంలో ఆయనకు ఆయనే సాటి. వాటినే నమ్ముకున్న ఆయ న రాజకీయ జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని.. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటారన్న గుర్తింపు పొందారు. ఆయన తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అధిరోహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేకతను సాధించారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామం లో జన్మించిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గ్రామసర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సర్పంచ్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేసిన ఆయన టీడీపీలో చేరారు. ఆ పార్టీలో జిల్లా ప్రచార కార్యదర్శిగా రాజకీయాన్ని ప్రారంభిం చి ఏడేండ్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించి పార్టీని జిల్లాలో బలోపేతం చేయటంతోపాటు ఇతర నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించటంలో కీలక పాత్ర పోషించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏపీఐడీసీ చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో(2009లో) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లోనూ టీడీపీ నుంచి రెండోసారి పోటీచేసి ఘన వి జయం సాధించారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతున్న తరుణంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మూడోసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
టీఆర్ఎస్ నాయకుల్లో రెట్టింపు ఉత్సాహం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టడంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకుల్లో నూతనోత్తేజం నెలకొన్నది. తమ నాయకుడికి జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించటంతో టీఆర్ఎస్ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లాతోపాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతుందని వారు పేర్కొంటున్నారు.
అభివృద్ధే ఆయన ఎజెండా..
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటితోపాటు గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకొస్తున్నారు. మిషన్‌కాకతీయ పథకంతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను మరమ్మతులు చేయించారు. అలాగే, చెరువులు, కుంటలకు నీరువచ్చే ప్రధాన కాల్వలకు కూడా మరమ్మతులు చేయించడంతో గతం లో కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమానికి సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రజల అవసరాలను తీర్చుతూ ముందుకు సాగుతున్నారు.
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ..
గత 15 ఏండ్లుగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం టున్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నా రు. దీంతో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరి అవసరం లేకుండానే నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల సహకారంతో ఘన విజయాలు సాధించారు. కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయనకు మంచి పేరుం ది. ప్రస్తుతం ఆయన నగరానికి వెళ్లకుండా ఇబ్రహీంపట్నంలోని క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం సహాయనిధి పథకం ద్వారా ఈ ప్రాంతంలోని వ్యాధిగ్రస్తులు, ప్రమాదాల బారిన పడిన వారికి జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఆర్థికసాయాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో ముందంజలో ఉన్నారు.