
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం
కూరగాయల రైతులకు సర్కారు ప్రోత్సాహం
న్యాల్కల్, నవంబర్ 30: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు రాయితీలు ఇవ్వడంతో అన్నివర్గాల రైతులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని కాలాల్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడం కూడా రైతులకు కలిసివస్తున్నది.
మండలంలోని పలుగ్రాల్లో కూరగాయల సాగు..
వాతావరణానికి అనుకూలంగా ఏపుగా పెరిగే ఆకుకూరలను పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. మండలంలోని హద్నూర్, గుంజోట్టి, రాంతీర్థం, ముంగి, మెటల్కుంట, గంగ్వార్, న్యాల్కల్, న్యామతాబాద్, హుసేల్లి, మామిడ్గి, రాజోలా తదితర గ్రామాల్లో రైతులు ఏపుగా పెరిగే ఆకు కూరలు కొత్తిమీర, పూదీనా, మెంతికూర, పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలికూర, ముళ్లంగి, చుక్కకూరలతో టమాట, వంగ, ములక్కాయ, కాకర, బెండ, గోరు చిక్కుడు, దోస, ఆలు, ఉల్లిగడ్డ, గోబి తదితర పంటలను పండిస్తున్నారు. మండలంలోని హద్నూర్, గంగ్వార్, న్యాల్కల్ గ్రామాల్లో జరిగే వారంతపు సంతలతో పాటు జహీరాబాద్, కర్ణాటకలోని బీదర్ మార్కెట్లకు కూరగాయలను తరలిస్తున్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేసి ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. ఏడాదిలో వచ్చే మూడు కాలాల్లో ఏ సమయంలో ఎలాంటి కూరగాయలను చేతికి వస్తాయో వాటిని పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆకు కూరలు, కూరగాయల పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీరితోపాటు మరికొంత మంది రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశమున్నది.
సబ్సిడీపై కూరగాయల నారు..
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై కూరగాయల నారు పంపిణీ చేస్తున్నామని మండల ఉద్యానవన శాఖాధికారి అనుష తెలిపారు. టమాట, వంకాయ, మిర్చి పంటలను సాగు చేసేందుకు నారును పంపిణీ చేయనున్నామన్నారు. టమాట, వంకాయ నారు కోసం బ్యాంకులో రూ.1,500, మిర్చి నారు కోసం రూ.1,300 డీడీలను బ్యాంకులో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టమాట, వంకాయ నారు కోసం 25 రోజులు, మిర్చి కోసం 45 రోజుల ముందే రైతులు డీడీలు అందించాల్సి ఉంటుందన్నారు. జీడీమెట్లకు వెళ్లి రైతులు కూరగాయల నారు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు కూరగాయల నారు కోసం ఎంతైతే చెల్లిస్తారో అంత డబ్బు తిరిగి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు.