నేటి నుంచి నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి
హరితహారంలో 86.60 మొక్కల నాటింపు లక్ష్యం
పది రోజుల నిర్ధిష్ట కార్యాచరణ సిద్ధం
ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు భాగస్వామ్యం
పారిశుధ్యం, పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యం
దళితవాడల్లో సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
సూర్యాపేట, జూన్ 30 (నమస్తే తెలంగాణ);ఊరూవాడ సమగ్ర వికాసమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె, పట్టణ ప్రగతి నాలుగో విడుతకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు అంతటా పండుగ వాతావరణం నెలకొననున్నది. ఈ పది రోజుల్లో చేపట్టాల్సిన పనులపై నిర్ధిష్ట కార్యాచరణ ఖరారైంది. గత పల్లె ప్రగతి పనుల్లో వెనుకబడిన గ్రామాలతోపాటు దళిత వాడల అభివృద్ధిపైన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈసారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. మరోవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 86.60 లక్షల మొక్కలు నాటనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించి నిధులు కూడా విడుదలయ్యాయి.
సూర్యాపేట, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019సెప్టెంబర్‌లో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో పల్లెల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చెత్తాచెదారం, అపరిశుభ్రతతో దర్శనమిచ్చే గ్రామాలు నేడు పరిశుభ్రతను సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు మూడు విడుతలు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించగా అందులో పారిశుధ్య పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే గ్రామాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు, ట్రాక్టర్ల కొనుగోలు చేపట్టారు.
చేపట్టే పనులివీ..
4వ విడుత పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామంలో అన్ని రోడ్లను శుభ్రపర్చడం, రోడ్లపై గుంతలు పూడ్చడం, పాడుపడిన, కూలిపోయిన నిర్మాణాల తొలగింపు గ్రామాల్లో ఎలాంటి వ్యర్థాలు లేకుండా చూడడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపడతారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్ షెల్టర్లు వంటి ప్రాంతాలను శుభ్రపర్చనున్నారు. గ్రామాల్లో నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణకు రసాయనాలు చల్లడం, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు చేపడతారు. మంచినీటి వనరులను శుభ్రపరిచి క్లోరినేషన్ నిర్వహిస్తారు. పైప్ లైన్ నల్లాల లీకేజీలను మరమ్మతు చేపడతారు. మెగా ప్రకృతి వనాల కోసం ఇప్పటికే గుర్తించిన మండలానికో పదెకరాల్లో మొక్కలు నాటుతారు. అలాగే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఒక రోజు పవర్ డే నిర్వహించి వంగిపోయిన, తుప్పుపట్టిన, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తారు. వీధి దీపాలకు మూడవ వైర్ ఏర్పాటు చేయడం, మీటర్లు లేని చోట వెంటనే అమర్చుతారు. తొలి రోజు నుంచి పది రోజుల పాటు మొక్కలు నాటేందుకు నర్సరీల్లో పెంచిన మొక్కలను సిద్ధం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తారు. గ్రామాల్లో అన్ని వీధులు, అంతర్గత రహదారలు, లే అవుట్ ఖాళీ స్థలాలు, ఇతర ఖాళీ స్థలాల్లో వంద శాతం మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. దీనికి గాను 86లక్షల మొక్కలు సిద్ధం చేశారు.
మూడు విడుతల్లో పెండింగ్‌లో ఉన్న పనులను నాలుగో విడుతలో పూర్తి చేయడంతో పాటు గ్రామ సభ ద్వారా తీర్మానించిన కొత్త పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నేటి నుంచి నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం, ఆరోగ్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్, సంబంధ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు ఇంకా నిర్మించని గ్రామాల్లో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతారు. పల్లె ప్రగతి బృందం ప్రతి రోజూ ఉదయమే గ్రామ పంచాయతీకి చేరుకొని కార్యక్రమాలు చేపట్టాలి. ఈ పనులను కలెక్టర్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దీంతో పనులు ఆలస్యం కాకుండా జరిగేందుకు వీలు కలుగుతుంది.