ఈ నెల 9న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నమంత్రి కేటీఆర్, సబితారెడ్డి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, జనవరి 31 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సుమారు రూ.233 కోట్ల అభివృద్ధి పనులకు ఈనెల 9న శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్, హెచ్ఎండీఏ, వాటర్‌వర్క్స్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 9న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ఇబ్రహీంపట్నం నియోకజవర్గంలో పర్యటిస్తారన్నారు. నియోజకవర్గంలోని తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో మంత్రుల పర్యటన కొనసాగుతుందన్నారు. మొదట కుంట్లూరులో రూ.32.14 కోట్లతో మురుగునీటి తరలింపునకు నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. త్వరలోనే ఆ పనులు చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఔటర్ లోపలి గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం రాగన్నగూడలో ఫైలెట్ ప్రాజెక్టు ప్రారంభం, రాగన్నగూడ సమీపంలోని లక్ష్మీటౌన్షిప్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఆదిబట్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కొంగరకలాన్-ఆదిబట్ల రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం. ఎంపీపటేల్‌గూడ రోడ్డు, బీడీఎల్రోడ్డు, పోల్కంపల్లి రోడ్డు నిర్మాణం, ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై గల సాగర్‌రోడ్డు నుంచి బీడీఎల్ వరకు 100 ఫీట్ల రోడ్డు, ఇబ్రహీంపట్నం నుంచి అనాజ్‌పూర్ వరకు రోడ్డు విస్తరణ, ఇబ్రహీంపట్నంలో రెవెన్యూ కార్యాలయం భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన, ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం, మినీ స్టేడియం నిర్మాణం పనులను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ కమిషనర్లు యూసఫ్, జ్యోతి, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ డీఈ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ డీఈలు యాదయ్య, సత్యనారాయణ, గోపీనాథ్, హెచ్ఎండీఏ డీఈలు వెంకటరమణ, దీపక్, అనురాధ, ఏఈ ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేద్దాం
ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ని సంస్థాగతంగా బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం టీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ నెల 9న మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి నియోకజవర్గంలో పర్యటించనున్నారని, రూ.233 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారవుతుందని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడంతో పాటు, కోహెడ పండ్ల మార్కెట్‌కు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్లు స్రవంతి, స్వప్న, వైస్ చైర్మన్ యాదగిరి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, బుగ్గరాములు, చీరాల రమేశ్, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్
పేదప్రజలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన చెనమోని విజయలక్ష్మి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యాయి. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష చెక్కును సోమవారం క్యాంపు కార్యాలయంలో బాధితురాలి భర్త నాగరాజుకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్ జెర్కోని రాజు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, నాయకుడు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.