ఉపాధి హామీ మండల సామాజిక తనిఖీ సమావేశంలో డీఆర్డీవో పీడీ ప్రభాకర్
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 31 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సమావేశం సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులు, కూలీలకు చెల్లించిన డబ్బులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పనుల విషయంపై చర్చించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకం, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణపై చర్చించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నూర్పుడు కల్లాలకు ఎప్పటికప్పుడు ఫండ్స్ అందజేస్తున్నందున రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఎంపీపీ కృపేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు సక్రమంగా పనులు కల్పించి ఎప్పటికప్పుడు కూలీడబ్బులు అందించాలన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఏపీడీ సక్రియానాయక్, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, ఆయా శాఖల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.