రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే ప్రారంభం ..
వికారాబాద్ జిల్లాలో 754 బృందాలతో..
రంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న మొదటి విడుత..
పట్టణ ప్రాంతాల్లో మరో పదిరోజులు పొడిగింపు
పరిగి, జనవరి 31 : కరోనా కట్టడి కోసం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే రెండో విడుత సోమవారం నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు పది రోజులపాటు మొదటి విడుత సర్వే చేసిన ప్రత్యేక బృందాలు రెండో విడుత సర్వేను ప్రారంభించాయి. మొదటి విడుత సర్వేలో ప్రత్యేక బృందాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 233201 కుటుంబాల సర్వేను పూర్తి చేశాయి. రెండవ విడుతలోనూ ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 566 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 92 బృందాలు, గ్రామాల్లో 662 బృందాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 754 ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేపడుతున్నాయి. ప్రతిరోజు 20 నుంచి 30 ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులందరి వివరాలు తెలుసుకొని ఎక్కడికక్కడే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్ మున్సిపాలిటీలో 34 బృందాలు, పరిగిలో 10, కొడంగల్‌లో 12, తాండూరులో 36, సిద్దులూర్ పీహెచ్సీ పరిధిలో 26, పూడూరులో 17, చన్గోముల్లో 16, నవాబుపేట్‌లో 35, దోమలో 38, చిట్యాల్‌లో 33, కులకచర్లలో 41, పట్లూర్‌లో 44, బంట్వారంలో 18, మోమిన్‌పేట్‌లో 38, నాగసముందర్లో 21, ధారూర్‌లో 23, పెద్దేముల్లో 48, జిన్‌గుర్తిలో 35, నవాల్గలో 25, బషీరాబాద్‌లో 22, యాలాల్లో 47, బొంరాస్‌పేట్‌లో 53, అంగడిరాయచూర్లో 32, దౌల్తాబాద్‌లో 50 ప్రత్యేక బృందాలు సర్వే చేపడుతున్నాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందజేయడం జరుగుతున్నది. మొదటి విడుత సర్వే సమయంలో ఈ లక్షణాలు బయటపడ్డ వారికి మందులు వాడడంతో పూర్తిస్థాయిలో నయమైన వారి వివరాలు తెలియనున్నాయి. దీంతో కొవిడ్ నియంత్రణ ఎంత వరకు సాధ్యమైంది తెలుస్తున్నది. మొదటి విడుతలో ఇంటివద్దే కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. సోమవారం జిల్లా వైద్యాధికారి తుకారాంభట్ దోమ మండలం బొంపల్లి గ్రామంలో పరిశీలించి సర్వే తీరును, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను తెలుసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 5.41లక్షల ఇండ్లలో సర్వే
ఇబ్రహీంపట్నం, జనవరి 31 : కరోనాను కట్టడిలో భాగంగా జిల్లావైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొదటివిడుతలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5.41లక్షల ఇండ్లలో జ్వరసర్వే నిర్వహించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో జనవరి 21నుంచి 31వరకు సుమారు పదిరోజుల పాటు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 13433మంది జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించారు. వీరిలో 4032మంది హోం ఐసొలేషన్‌లో ఉంచి మందులను అందజేశారు. మరోరెండు రోజుల్లో రెండోవిడుత జ్వరసర్వే నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జ్వరసర్వేను మరో వారంరోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. శివారు ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో పదిరోజులు అదనంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. జిల్లా వ్యాప్తంగా 350కి పైగా ప్రత్యేక టీంలను ఏర్పాటుచేశారు. వైద్యారోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎమ్లు, అంగన్వాడీలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
బుధవారం నుంచి రెండో విడుత జ్వర సర్వే..
ఫిబ్రవరి 2నుంచి రెండోవిడుత జ్వరసర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన ఇండ్లలో 350ప్రత్యేక టీంలతో సర్వే నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ భావించింది. ప్రతి ఇంటికివెల్లి జ్వరం, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించటంతో పాటు వారిలో కరోనా లక్షణాలున్నవారికి అక్కడికక్కడే పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. పాజిటివ్ ఉన్నవారిని హోంఐసొలేషన్‌లో ఉంచటంతో పాటు వారికి అవసరమైన మందులను అందించనున్నారు.
పకడ్బందీగా రెండో విడుత
రంగారెడ్డిజిల్లాలో కరోనా కట్టడి నేపథ్యంలో నిర్వహిస్తున్న జ్వరసర్వే నేటితో ముగియనుంది. సర్వే పూర్తికావటం వలన బుధవారం నుంచి రెండోవిడుత సర్వేను నిర్వహించాలని నిర్ణయించాము. రెండోవిడుత సర్వేను పకడ్బందీగా నిర్వహించి కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జ్వరసర్వే వలన కరోనా కేసులను మరింత కట్టడి చేయగలిగాము. జ్వరసర్వే ఫలితంగా కరోనాను వ్యాప్తి కాకుండా నిరోదించగలిగాము.
.