
జహీరాబాద్/సంగారెడ్డి అర్బన్, జనవరి 27 : ఆదాయం వచ్చే రూట్లలో మరిన్ని బస్సులు నడుపుతామని, జహీరాబాద్ డిపో నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు బస్సులు పెంచుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను పరిశీలించి, ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణికుల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీకి జహీరాబాద్ డిపో ఎంతో ము ఖ్యమని, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. డిపోకు 10శాతం ఆదాయం ఎక్కువగా వస్తున్నదని తెలిపారు. కార్మికులకు ప్రతినెలా 1న వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. వారి కార్మికుల సమస్య ల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందన్నారు. ఆదాయం పెరిగిన తర్వాత పీఆర్సీ అమలు చేయడంతో పాటు డీఏలు చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌పై చైతన్యం చేసి అందరూ వేసుకునేలా కృషిచేశామన్నారు. కొత్త రూట్లలో బస్సులు నడిపించేందుకు ట్రాఫిక్ సమస్యను పరిశీలించి చూస్తామన్నారు. జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న షాపులో ప్రయాణికులకు నాణ్యమైన వస్తువులు అమ్మకాలు చేసేందుకు డీఎం రమేశ్ కృషి చేయాలన్నారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్గో కేంద్రానికి వెళ్లి ప్రతి రోజు ఎన్ని వస్తువులు రవాణా చేస్తున్నారు.. ఎంత ఆదాయం వస్తుందో అడిగి తెలుసుకున్నారు. మూత్రశాలలో నిర్వహణను స్వయంగా వెళ్లి పరిశీలించారు. బస్టాండ్‌లో పర్యటించి ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు గ్రామాలకు బస్సులు నడిపించాలని కోరగా, పరిశీలించి నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎం రమేశ్‌కు ఆదేశించారు. బస్టాండ్‌లో బస్‌లు రాకపోకల రికార్డులు పరిశీలించారు. డిపో ఆవరణలోని పార్కులో మొక్క నాటారు. ఆర్టీసీ బస్సులు శుభ్రం చేసే యం త్రాన్ని పరిశీలించారు. డిపోకు అదనపు బస్సులు ఇస్తామని కార్మికులకు తెలిపారు. కార్మికుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎండీని జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు సన్మానించారు. ఆయన వెంట ఆర్టీసీ సంగారెడ్డి ఆర్ఎం సుదర్శన్, జహీరాబాద్ డిపో మేనేజర్ రమేశ్, అధికారులు శ్రీనివాస్, జహీరాబాద్ పట్టణ ఎస్సై శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. జహీరాబాద్ నుంచి బస్సు ప్రయాణం ద్వారా గురువారం సాయంత్రం సంగారెడ్డి బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్ డిపోను సందర్శించిన ఎండీ సజ్జనర్ మొక్కలు నాటారు.