ప్రారంభమైన సీజన్.. ఊపందుకున్న వ్యాపారం
రామాయంపేట నుంచి మహారాష్ట్ర, కర్ణాటక,మధ్యప్రదేశ్,బీహార్‌కు తరలుతున్న పండ్లు
జోరుగా కొనుగోళ్లు.. స్థానికులకు ఉపాధి
సీతాఫలాల్లో ఔషధ గుణాలు
రామాయంపేట, అక్టోబర్ 6: మూడు జిల్లాల కూడలిగా ఉన్న రామాయంపేట మార్కెట్లో సీతాఫలాల విక్రయాలు ఊపందుకున్నాయి. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారు సీతాఫలాలు సేకరించి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్,బీహార్ రాష్ర్టాలకు కాయలను డీసీఎంలో తరలిస్తున్నారు. నిత్యం మూడు డీసీఎంల్లో ఇక్కడి నుంచి రవాణా చేస్తున్నారు.
సీజనల్ ఉపాధి..
సీతాఫలాల సేకరణతో పలువురికి సీజనల్‌గా ఉపాధి పొందుతున్నారు. తెల్లవారగానే కూలీలు తట్టబుట్ట చేత పట్టుకుని అడవికి వెళ్లి సీతాఫలాలు సేకరిస్తారు. తెల్లవారుజామున నలుగురైదుగురు కలిసి ఓ ఆటోను తీసుకుని అడవికి పోయి సీతాఫలాలను సేకరిస్తారు. ఒక్కో కూలీ రోజుకూ నాలుగు గంపల వరకు సేకరిస్తారు. తెల్లవారుజామున వెళ్లిన కూలీలు సాయంకాలం వరకు అడవిలోనే ఉండి చెట్టు పుట్ట తిరుగుతూ ఫలాలను సేకరిస్తారు. వాటిని ఆటోలోనే రామాయంపేటకు తీసుకువచ్చి విక్రయిస్తారు. ఇంత కష్టపడ్డా వీరికి ఒక్కోసారి కూలీ గిట్టుబాటు కాదు. ఒక్కోసారి గంపకు రూ.200 నుంచి రూ.300 వరకు ధర పలుకుతుంది. ఎక్కువ గంపల్లో సీతాఫలాలు వచ్చినప్పుడు వారి ఇష్టాను సారంగా ధరలను పెట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. రామాయంపేటలో రోజుకు 250 మంది వరకు సీతాఫలాల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. రామాయంపేటతో పాటు నిజాంపేట, భిక్కనూరు, దోమకొండ, నార్సింగి, దౌల్తాబాద్, చిన్నశంకరంపేట, బీబీపేట తదితర మండలాల నుంచి సీతాఫలాలు తెచ్చి విక్రయిస్తున్నారు. గంపల లెక్కన విక్రయాలు జరుపుతుంటారు. వ్యాపారులు కాయలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. సీతాఫలాల్లో ఔషధ గుణాలు ఉండడంతో రోడ్డున వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం ఆగి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఈసారి ముందుగానే సీతాఫలాల సీజన్ రావడంతో కూలీలంతా అడవిబాట పట్టారు.
ఫలాలతోనే కుటుంబ పోషణ
సీతాఫలాలతోనే మా కుటుంబం గడుస్తున్నది. ఏ సీజన్లో ఆ పండ్లు తెస్తాం. నాట్ల కాలంలో కలుపు పనికి పోతాం. సీతాఫలాల సీజన్లో అటవీ నుంచి సీతాఫలాలను తీసుకొని వచ్చి రామాయంపేటలోనే అమ్ముతాం. రోజుకూ రెండు నుంచి మూడు వందల వర కు సంపాధించుకుంటాం. నేను నా భర్త ఇద్దరం ప్రతిరోజూ సీతాఫలాల విక్రయాలతోనే జీవనోపాధి పొందుతున్నాం.
-లంబాడీ రాధ, రామాయంపేట