
15వ రోజూ మెతుకు సీమలో గోదావరి జలాల ప్రవాహం
నిండిన మరో రెండు చెక్‌డ్యామ్‌లు
గంగమ్మకు పూజలు చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సీఎం కృషితోనే రైతుల కల సాకారమైందని వెల్లడి
వెల్దుర్తి, ఏప్రిల్ 20 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదిహే నో రోజూ పరుగులు తీశాయి. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో దామరంచ, బతుకమ్మబండ చెక్‌డ్యామ్ లు నిండి మత్తళ్లు దుంకి కొల్చారం మండలం లోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో హల్దీవాగుపై 32 చెక్‌డ్యామ్‌లకు గాను మంగళవారం వరకు 28 నిండాయి. అలాగే నాలుగు చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మంగళ వారం దామరంచ చెక్‌డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేశారు. రైతుల సాగునీటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఆయన అన్నారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదిహేనో రోజూ మంగళవారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్‌డ్యామ్‌లు నిండుతున్నాయి. 15వ రోజైన సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని దామరంచ, బతుకమ్మబండ చెక్‌డ్యామ్‌లు నిండి మత్తళ్లు దుంకాయి. మంగళవారం కిలోమీటరున్నర దూరం గోదావరి జలాలు ప్రవహించాయి. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. కాగా, మరో ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరనున్నాయి. హల్దీవాగుపై 32 చెక్‌డ్యామ్‌లకు గాను మంగళవారం వరకు 28 నిండాయి. మొత్తం నాలుగు చెరువులు నిండాయి.
మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో మత్తళ్లు దుంకిన చెక్‌డ్యాంలు
ఉగాది పర్వదినాన మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు వారం రోజుల పాటు మాసాయిపేట్, వెల్దుర్తి మండలాల్లో హల్దీవాగులో పరవళ్లు తొక్కాయి. ఉగాది రోజైన ఈనెల 13న మాసాయిపేట మండల పరిధిలోని మాసాయిపేట చెక్‌డ్యామ్‌కు గోదావరి జలాలు చేరాయి. వారం రోజుల పాటు ప్రవహించిన గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని చిన్ననీటి తరహా ప్రాజెక్టు హల్దీ మత్తడి దూకింది. అనంతరం వెల్దుర్తి మండల పరిధిలోకి ప్రవేశించిన గోదావరి జలాలు, కొప్పులపల్లి చెక్‌డ్యాంతో పాటు వెల్దుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని రెండు చెక్‌డ్యామ్‌లు నిండి అలుగు పారాయి. ఉప్పులింగాపూర్, కుకునూర్, దామరంచ చెక్‌డ్యామ్‌లతో పాటు దామరంచ గ్రామ శివారులోని బతుకమ్మ చెక్‌డ్యాం అలుగులు పారించింది. మంగళవారం కొల్చారం మండలంలోకి ప్రవేశించిన గోదావరి జలాలు.. వడివడిగా మంజీరా నది వైపు పరుగులు తీస్తున్నాయి.