
ఓట్లు, సీట్లలోనూ ఆర్ఎస్దే పైచేయి
పోలైన ఓట్లలో సగానికిపైగా కారుకే..
టీఆర్ఎస్ కూటమికి 54.50, కాంగ్రెస్ కూటమికి 25.13 శాతం ఓట్లు
మంత్రి పువ్వాడ అజయ్‌కు సీఎం కేసీఆర్ అభినందన
ఖమ్మం, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికేదైన గులాబీదే విజయమని మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసినా.. నగర ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారు. ప్రత్యర్థులు అవాకులు, చెవాకులు పేలినా.. ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఓటర్లు భారీ మెజార్టీ అందించారు. ఖమ్మం గుమ్మంలో గులాబీ గుబాళించి రెండోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో 2,83,302 ఓట్లకు 1,69,404 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 52.48 శాతం ఓట్లు వచ్చాయి. గులాబీ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీసింది.
ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు టీఆర్ఎస్కు విశిష్ట తీర్పునిచ్చారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. నగరం అభివృద్ధి పరంగా అగ్రగామిగా ఉండడంతో ఓటర్లు గులాబీ అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. పోలైన ఓట్లలో మొత్తంగా 52.48 శాతం ఓట్లు టీఆర్ఎస్కు వేసి మరోసారి తమ చైతన్యాన్ని చాటుకున్నారు. ఎన్నిక ఏదైనా ‘గులాబీ’దే విజయమని ఇంకోసారి నిరూపించారు.
తొలి రెండు రౌండ్లలోనే సానుకూలం..
ఉత్కంఠతభరితంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి, రెండు రౌండ్లలోనే ఫలితాల సరళి టీఆర్ఎస్ అనుకూలమన్న సంకేతాలు ఇచ్చింది. మొత్తం ఆరు రౌండ్లలో 59 డివిజన్ల ఓట్లను లెక్కించగా నాలుగో రౌండ్లో లెక్కించిన పది డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నగరపాలకసంస్థ పరిధిలో 2,83, 302 ఓట్లకు గాను 1,69, 404 ఓట్లు పోల్ అయ్యాయి. సీపీఐతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ 57 స్థానాల్లో పోటీ చేయగా 43 స్థానాల్లో గెలుపొందింది. 88,916 ఓట్లను పొంది పోలైన ఓట్లలో సగానికిపైగా దక్కించకున్నది.
ప్రతిపక్షాలు డీలా..
48 డివిజన్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుని కేవలం 23.69 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6.18 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఈ పార్టీకి 10,486 ఓట్లు లభించాయి. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ రెండు స్థానాలను గెలుచుకుని 2.60శాతం ఓట్లు సాధించింది. ఆ పార్టీకి 4,410 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం రెండు స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీ 4.46శాతం ఓట్లు సాధించింది. 7,907 ఓట్లు తమ ఖాతాలో వేసుకున్నది. ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఆ పార్టీకి 1,174 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌శాతం 0.69గా నమోదైంది. ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు 79 మంది వేర్వేరు డివిజన్ల నుంచి పోటీ చేయగా ఇద్దరు గెలుపొందారు. వీరికి 11,393 ఓట్లు లభించాయి. ఓటింగ్‌శాతం 6.73 నమోదైంది.
నోటాకు 2,498 ఓట్లు..
59 డివిజన్లలో నోటాకు 2,498 ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 2,475 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 10వ డివిజన్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో అక్కడ టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కూటముల వారీగా ఓట్ల శాతం చూస్తే టీఆర్ఎస్, సీపీఐ కూటమికి 54.50 శాతం ఓట్లు లభించగా సీపీఎం, కాంగ్రెస్ కూటమికి 25.13 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జనసేనకు కలిపి 7.52శాతం లభించగా స్వతంత్రులకు 8.18శాతం ఓట్లు లభించాయి. అనేక డివిజన్లలో టీఆర్ఎస్కు లభించిన ఓట్లకు ప్రత్యర్థి పార్టీలకు లభించిన ఓట్లకు పొంతన లేని పరిస్థితి నెలకొంది.