గతేడాది ఏప్రిల్ కంటే 62.9 శాతం వృద్ధితో ఉత్పత్తి
27.5 శాతం వృద్ధితో ఓబీ తొలగింపు
822.94 మి.యూ విద్యుత్ ఉత్పత్తితో థర్మల్ కేంద్రం
పెద్దపల్లి, మే 1 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని : కరోనా కష్టకాలంలోనూ సింగరేణి సంస్థ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. గత ఏప్రిల్‌లో గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో సాధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్‌లో 54.43 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, గతేడాది సాధించిన 30.4 లక్షల టన్నుల ఉత్పత్తిపై 61.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, గత నెలలో 347 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీసి గతేడాది ఇదే నెలలో వెలికితీసిన 272.2 లక్షల క్యూబిక్ మీటర్లపై 27.5 శాతం వృద్ధిని సాధించింది. కరోనా సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సింగరేణి కార్మికులు, అధికారులు ఏప్రిల్ నెలలో ఇంతటి వృద్ధిని సాధించడంపై సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్ కర్మాగారాల్లో ఏమాత్రం కొరత ఉండరాదన్న ఉద్దేశంతో కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ రోజుకు సగటున 1.80 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు చెప్పారు. సగటున రోజుకు 31 రైల్వే ర్యాకుల చొప్పున గత నెల 940 ర్యాకుల్లో బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు. ప్రతి రోజూ 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాతోపాటు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు లక్ష్యాన్ని సాధించాలని కోరారు.
98.53 పీఎల్ఎఫ్ సాధించిన థర్మల్ కేంద్రం
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏప్రిల్ నెలలో 822.53 మి.యూ విద్యుత్‌ను 98.53 శాతం పీఎల్‌ఎఫ్‌తో సాధించినట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. గతేడాది ఇదే మాసంలో 72.29 పీఎల్ఎఫ్ మాత్రమే ఉండగా ఈసారి 26 శాతం వృద్ధిని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్‌లోని ఒకటో యూనిట్ 411.89 మి.యూ విద్యుత్‌తో 98.63 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని, రెండో యూనిట్ 411.05 మి.యూ విద్యుత్ ఉత్పత్తి చేసి 98.43 శాతం పీఎల్ఎఫ్ సాధించినట్లు తెలిపారు. ఏప్రిల్ మొత్తం మీద 98.53 శాతం పీఎల్‌ఎఫ్‌తో 822.94 మి.యూ విద్యుత్ ఉత్పత్తి చేసి దీనిలో 777.21 మి.యూ రాష్ట్ర అవసరాలకు అందించడం జరిగిందన్నారు. ఇదే ఒరవడితో మంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ రాష్ట్ర అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన ఉద్యోగులను కోరారు.
సోలార్ ప్లాంట్ల నుంచి 46.95 మెగావాట్ల విద్యుత్
సింగరేణి సంస్థ ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా నెలకొల్పిన సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు మొత్తం మీద 46.15 మి.యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు సీఎండీ తెలిపారు. మణుగూరులోని 30 మెగావాట్ల ప్లాంట్ నుంచి 226 లక్షల యూనిట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి 146 లక్షల యూనిట్లు, ఇల్లందు 39 మెగావాట్ల ప్లాంట్ నుంచి 61.61 లక్షల యూనిట్లు, రామగుండం 30 మెగావాట్ల ప్లాంట్ నుంచి 39 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేశామన్నారు. అలాగే, ఇటీవల రెండో ఫేజ్‌లో ప్రారంభమైన మందమర్రిలోని రెండు ప్లాంట్ల నుంచి 3.9 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, మొత్తం మీద 46.96 మి.యూ విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థలకు అనుసంధానం చేయగలిగామని చెప్పారు. అక్టోబర్ నాటికి మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయి విద్యుత్‌ను అనుసంధానం చేస్తామన్నారు.
అమ్మకాల్లోనూ గణనీయ వృద్ధి
గతేడాది ఏప్రిల్ నెలలో కేవలం రూ.1201 కోట్ల అమ్మకాలు జరుగగా ఈ ఏప్రిల్‌లో రూ.1693 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 41 శాతం అమ్మకాల్లో వృద్ధి సాధించింది. లాభాల ప్రకారంగా చూసినా గతేడాది ఏప్రిల్‌లో కేవలం రూ.17.65 కోట్ల లాభాలుగా ప్రాథమికంగా గుర్తించగా ఈ ఏప్రిల్‌లో ఇవి రూ.203 కోట్ల వరకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.