సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్
యోగాభ్యాసానికి ప్రశాంతమైన ప్రదేశం, స్థిరమైన సుఖాసనం అవసరం. స్థిరాసనం సిద్ధించాక, బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మళ్లించి, చిత్తవృత్తిని నిరోధించి, సాధించవలసిన లక్ష్యంపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి. స్థిరాసనంపై కూర్చొని యోగాన్ని అనుష్ఠించిన సాధకుని అంతఃకరణం పరిశుద్ధమవుతుంది, అంటాడు కృష్ణపరమాత్మ.
శరీరాన్ని భూమిపై సమంగా, వెన్నెముకను నిటారుగా నిలిపి, వీపు, మెడ, తల ఒకే సరళరేఖలో స్థిరంగా, అచలంగా (కదలకుండా) ఉంచాలి. అలాగే కటిభాగం నుంచి మెడ వరకు ఉండే శరీరాన్ని కూడా స్థిరంగా ఉంచాలి. అంటే శరీరంలోని వివిధ అంగాలనూ సహజస్థితిలో నిశ్చలంగా ఉంచాలే కానీ, బిగించకూడదు. అదే సమంగా ఉంచడం అనిపించుకుంటుంది. తర్వాత దిక్కులు చూడకుండా, నాసికాగ్రమును చూస్తూ కనులు మూసుకోవాలి. కనులు మూయడం వల్ల బాహ్యజగత్తుతో బంధాలు తెగిపోతాయి. నాసికాగ్రాన్ని చూడటం అంటే ముక్కుచివరనని కొందరు, భ్రూమధ్యమం అని కొందరు చెబుతారు. కానీ, ఈ రెండిటి వల్ల తలనొప్పి కలుగుతుందే తప్ప దృష్టి స్థిరంగా ఉండదు, లక్ష్యంపై కేంద్రీకృతం కాదు. ప్రతీకాత్మకంగా చూస్తే నాసిక సత్యానికి ప్రతీక అనుకోవచ్చు. సత్యమే భగవంతుడు కాబట్టి సత్యనిష్ఠపై దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే భ్రూమధ్యం ప్రాణవృత్తులకు నిలయం. కాబట్టి ప్రాణవృత్తులపై దృష్టిని నిలపాలి. దానితో మనసు చంచలతను వీడి ప్రశాంతమవుతుంది. అనుకూలంగా లేని ప్రదేశంలో, నిలుచొని లేదా పడుకొని ధ్యానం చేయడం తగదని చెపుతున్నాడు కృష్ణపరమాత్మ.
ఈ శ్లోకం ఆధ్యాత్మిక ఉన్నతికి, వ్యక్తిత్వ పరిణతికి, జీవన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునేందుకు మార్గదర్శనం చేస్తూనే భౌతిక జీవన వికాసానికి కూడా ఉపకరిస్తుంది. యాజమాన్య నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణ లాంటి అంశాలనూ పరోక్షంగా ప్రస్తావిస్తున్నది. ‘సమం కాయశిరోగ్రీవం’ అనడం వ్యక్తిత్వ సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తుంది. శరీరం, మెడ, తలను ఒకే సరళరేఖలో ఉంచమని చెప్పడం, ద్వారా సంస్థలో దార్శనికత, వ్యూహరచన, వ్యూహాన్ని ఆచరణలో పెట్టడం అన్నీ ఒకే దిశలో సాగాలని సూచిస్తుంది. శిరస్సు దార్శనికతకు, మెడ సమాచార వ్యవస్థ, వ్యూహాత్మకతకు, శరీరం కార్యాచరణకు ప్రతీకలుగా నిలుస్తాయి. వీటిమధ్య సమన్వయం ఉంటేనే సంస్థ ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. అచలం, స్థిరం అనేది సంస్థలో స్థిరత్వాన్ని సూచిస్తుంది. స్థిరత్వం అంటే మారని విలువలు, అనువైన విధానాలుగా చెప్పుకోవచ్చు. నిరంతరం మారే నిర్ణయాలు, విధానాలు, ఉద్యోగులూ వినియోగదారులలో అయోమయాన్ని కలిగిస్తాయి. సమర్థత కలిగిన నాయకుడు సుస్థిరమైన విలువలను కలిగి ఉంటాడు. నాయకుడి వివేకవంతమైన నిర్ణయాలు లక్ష్య సాధనలో దృఢత్వాన్ని ప్రకటిస్తాయి. ‘సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం’ అనడం లక్ష్యంపై ఏకాగ్రతకు ప్రతీక. ఏకాగ్రచిత్తంతో అచంచల దీక్షతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒకేసారి వివిధమైన కార్యాలను సంకల్పించకుండా ప్రాధాన్య క్రమంలో ఒకదాని తర్వాత మరొకదానిని పూర్తిచేయడం వల్ల సమర్థంగా కార్య నిర్వహణ జరుగుతుంది. అవసరంలేని కార్యాన్ని ఎంత ప్రభావవంతంగా నిర్వహించినా అది నిరుపయోగమే. ఇతరులు చేసే విమర్శలపై దృష్టిని పెడితే మన లక్ష్యానికి దూరమవుతాం. ఒకరితో పోల్చుకోవడం కన్నా నిబద్ధతతో లక్ష్యంవైపు సాగడం మిన్న అంటారు.
యోగసాధనకు ప్రశాంతమైన స్థలం ఎలాగైతే అవసరమవుతుందో అలాగే పని స్థలంలో ప్రశాంతతనిచ్చే సరైన వాతావరణం ఉండాలి. దీనినే సంస్థ సంస్కృతి అనీ, ఉత్పాదకత కలిగిన పని స్థలమనీ, రక్షణ, భద్రతనిచ్చే కార్యస్థలమనీ చెప్పుకొంటాం. కార్యసాధనలో భావోద్వేగ నిర్వహణ చాలా ప్రముఖమైనది. దానినే ఇంద్రియ నియంత్రణగా చెబుతున్నది భగవద్గీత. కోపం, భయం, అసూయాద్వేషాలు, అహంకార మమకారాలు ఇలాంటి భావోద్వేగాలు మనసును లక్ష్యం నుంచి మళ్లిస్తాయి. బాహ్య ప్రపంచం నుంచి మనసును మరలించడం అంటే ఈ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండటం. దీనిని భావోద్వేగ నియంత్రణగా చెప్పుకోవచ్చు. నాయకత్వం నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే అంతఃకరణ శుద్ధిగా భావించాలి.
యోగసాధన వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుందని చెపుతుంది గీత. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుత ప్రవర్తన, విలువల ఆధారిత నిర్ణయాల లాంటివి అంతఃకరణ శుద్ధి కలిగిన నాయకుడి లక్షణాలుగా భావించాలి. ఇవి లేకుండా సాధించిన గెలుపు తాత్కాలికంగా ప్రయోజనం కలిగించినా శాశ్వత
లక్ష్యానికి దూరం చేస్తాయి.
యోగసాధన నిజానికి స్వీయనిర్వహణే. స్వీయ నియంత్రణ కలిగిన నాయకులే సంస్థను నిర్వహించగలరు, ఉన్నత పథంలో నిలుపగలరు. భౌతిక జీవనంలో సాఫల్యాన్ని పొందాలన్నా, సమర్థమైన నాయకత్వ ప్రదర్శనకైనా వ్యక్తి ముందుగా తనను తాను స్థిరపరచుకోవడం, తదుపరి లక్ష్యంపై ఏకాగ్రతతో ముందుకు సాగడం, బృందాన్ని సరైన దిశలో నడిపించడం అవసరం.