కుడు పరీక్షిత్తుతో… రాజా! మారుని- మన్మథుని దెబ్బకు తారుమారై తట్టుకోలేక కుమారుని (పూరువు) యవ్వనంతో వెయ్యేండ్లు విషయ సుఖాలు అనుభవించిన యయాతి మహారాజుకు ఎప్పటికో వైరాగ్యం కలిగింది. విరక్తుడైన యయాతి తన స్వామిని దేవయానిని పురస్కరించుకొని లోకమంతటికినీ చాటిచెప్పిన మేటి గుణపాఠం… ‘న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి, హవిషా కృష్ణ వర్తేవ భూయ ఏవాభి వర్ధతే’- ఈ శ్లోకరత్నం భాగవతంలోనే కాదు, భారతంలోనూ, విష్ణుపురాణంలోనూ, ఇంకా మనుస్మృతిలో కూడా కనిపిస్తుంది. ఎన్ని చోట్ల కన్నా, విన్నా అధికారమున్న వానికే ఈ విన్నాణం- విజ్ఞానం కలుగుతుంది కాని అనధికారికి కాదు. ‘పాలల్లో తోడు వేస్తే పెరుగవుతుంది కాని నీళ్లలో వేస్తే కాదు కదా!’ అని శాస్త్రవాక్యం. దీనికి పోతన అమాత్యుని అర్థవంతమైన, అందమైన అనువాదం-
కం॥ ‘కామోపభోగ సుఖములు
వేమారును పురుషుఁడనుభవింపుచు నున్నం
గామంబు శాంతిఁబొందదు
ధూమధ్వజుడాజ్య వృష్టిఁ ద్రుంగుడు వడునే’
ఓ చెలీ! పురుషుడు విషయ సుఖాలు- భోగవాంఛలు అనుభవించే కొద్దీ అవి పెరుగుతూ- కొనలు సాగుతూనే ఉంటాయి తప్ప ఉపశమించవు. వామాక్షీ! కామాగ్ని చల్లారదు. పైనుంచి ఆజ్య- నేతి ధారలు ఆగకుండా పడుతూ ఉంటే అగ్గి భగ్గుభగ్గున మండుతుందే కాని ఆరుతుందా? అణగారుతుందా? కాన, అనుభవాన్ని అమాంతంగా, ఒక్కసారిగా నిషేధించకనే క్రమక్రమంగా కోరికలను తుంచివేసుకొనమని మన పెద్దలు బోధించారు.
రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. రాక్షస రాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఆ ముద్దుగుమ్మలిద్దరూ మంచి స్నేహితురాండ్రు. ఒకనాడు పొద్దుపోక శర్మిష్ఠ చెలికత్తెలు వెంటరాగా దేవయానితో కలిసి వనవిహారానికి వెళ్లింది. అక్కడ వారు దుస్తులు విప్పి ఒక అందమైన కొలనులో చెట్టాపట్టాలేసుకొంటూ జలకాలాటకు పూనుకున్నారు. అప్పుడే నందివాహనంపై ఇందుధరుడు, పాపహరుడు, సదాశివుడు పార్వతీ సమేతంగా సంచారం చేస్తూ ఆ చోటుకు వచ్చాడు. శివుని చూచి సిగ్గుపడిన వారంతా ఆదరాబాదరాగా చీరలు కట్టుకున్నారు. ఆ తత్తరపాటులో గట్టు పైకొచ్చి వేగంగా తన (దేవయానిది) చీర కట్టుకు వచ్చిన శర్మిష్ఠను చూచి దేవయాని- ‘తెలిసి తెలిసి ఈ దాసి నా చీరను ధరించవచ్చా?’ అంటూ దెప్పిపొడిచింది. మండిపోతున్న దేవయాని మాటలు విని శర్మిష్ఠ ఆగని కోపంతో నాగిని లాగా బుసలు కొడుతూ ‘ఓ చెలులారా! భిక్షుకుడైన దీని తండ్రి మా నాన్న దయాభిక్షతో బతుకుతున్నాడు. ఇదేమన్నా నాలాగా రాచపుట్టుక కల్గిందా? అసలు ఈ చీరమాత్రం మేమిచ్చిందే కదా? దీనికింత గీర- గర్వం ఎందుకు? దీని కుక్షి- పొట్ట పగిలేలా రెట్ట పట్టుకొని దీనిని ఈ బావిలోకి నెట్టి పారేయండి?’ అని గట్టిగా అరుస్తూ శర్మిష్ఠ వలువ-చీర ఇయ్యకుండానే దేవయానిని నూతిలో పడతోయించి వెళ్లిపోయింది.
చంద్రవంశపు యాదవ శాఖీయులకు ఆది- ప్రధాన పురుషుడు యయాతి మహారాజు. ఈయన నహుష చక్రవర్తి కుమారుడు. ఖ్యాతిగాంచిన ఆ యయాతి వేటాడుతూ దైవ యోగం వలన ఆ నూతి వద్దకు వచ్చి, పై దుస్తులు లేక సిగ్గుతో వణుకుతూ విలపిస్తున్న దేవయానిని కని వెంటనే చుట్టుకోవడానికని తన పైవస్ర్తాన్ని ఇచ్చాడు. ఆపైని సమర్థవంతమైన తన కుడి చేతిని అందించి ఆ నాతిని నూతినుంచి పైకి లాగాడు. ఆ దేవయాని యయాతితో ‘మహారాజా! నా పాణి (చేతి)ని గ్రహించి, నాకు ప్రాణదానం చేసిన నీవే నా ప్రాణనాథుడవు. ఇది దైవ ఘటన. మన పెండ్లి జరుగక తప్పదు. ఓ సుగుణ ఖనీ (నిధీ)! నేను అసుర గురువు శుక్రుని పుత్రిక దేవయానిని. అవి బృహస్పతి పుత్రుడు కచుడు మా తండ్రి వద్ద మృతసంజీవనీ విద్యను అభ్యసించే రోజులు. అతనిని నేను కామించాను. ‘నీవు గురు పుత్రికవు. నాకు సోదరి సమానవు’ అని నన్ను అంగీకరించని కచుడుని, తాను నేర్చిన విద్యను విస్మరించే విధంగా నేను శపించాను. అతను కూడా ‘ఏ బ్రాహ్మణ కుమారుడూ నీకు పతి కాబోడు’ అని నాకు ప్రతిశాపం ఇచ్చాడు. కనుక, మహారాజా! నీవే నా పతివి- అని పలికింది. ధీరమతి అయిన ధాత్రీవరుడు యయాతి సుగాత్రి అయిన ఆ దేవయానిని వరించాడు.
రాజా! తండ్రి వద్దకు వచ్చి దేవయాని, శర్మిష్ఠ చేసిన దురాగతమంతా చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. ‘ఔరా! ఇలాంటి క్రూరాత్ముల ఇళ్లల్లో పౌరోహిత్యం చేయడం పాపం. ఇలా జీవించడం కన్నా కపోత వృత్తి- ఉంఛవృత్తి, పావురాల వలె ఎప్పటికప్పుడు దొరికిన దాన్ని తిని కాలం వెళ్లబుచ్చడం మేలు’ అని భావించి శుక్రుడు వృషపర్వుని కొలువు మానేసి దేవయానితో ఊరు వదలి వెళ్లిపోయాడు. శుక్రుని సాయం లేక దేవతలను జయించే మరో ఉపాయం లేదని ఖాయంగా గ్రహించిన అసుర రాజు ఆచార్యుని పాదాలపై పడి ప్రార్థించి ప్రసన్నునిగా చేసుకొన్నాడు. శుక్రుడు శిష్యునితో- ‘నీ కూతురు (శర్మిష్ఠ) తన వేయిమంది చెలికత్తెలతో దాసీలాగా, అల్లారు ముద్దుగా పెరిగిన నా కుమార్తెను సేవించడానికి అంగీకరిస్తే నా కోపం చల్లారుతుంది. అప్పుడే నేను మరల నీ రాజ్యానికి వస్తా’ అన్నాడు. అంగీకరించిన అమరారి వర్యుడు- అసుర శ్రేష్ఠుడు తన కొమరితతో ‘ఇంకా పంతం ఎందుకమ్మా?’ అని ఆజ్ఞాపించగా అయిష్టమైనా శర్మిష్ఠ కోపం దిగమింగి నిష్ఠతో దేవయానికి దాస్యం చేయసాగింది.
ఉ॥ ‘ఆతతమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో
పేతఁ దనూభవం బిలిచి పెండ్లి యొనర్చె మహా విభూతికిన్
బ్రీతి మహోగ్రజాతికి, నభీతికి, సాధు వినీతికిన్, సిత
ఖ్యాతికి భిన్నదుష్కలహ కార్యభియాతికి నయ్యయాతికిన్’
అనంతరం శుక్రుడు అసురరాజ పుత్రిక సేవలను అందుకొనే తన అనుంగు కూతురిని అభినందించి ఎంతో ఉత్సాహంతో మహావిభూతి- గొప్ప సంపద కలవాడు, మహోగ్రజాతి- క్షత్రియజాతికి చెందినవాడు, అభీతి- భయ రహితుడు, సాధువినీతి- సజ్జనుల ఎడ వినయం కలవాడు, సితఖ్యాతి- విశుద్ధమైన కీర్తికలవాడు, దుష్టత్వంలో అకారణ కలహానికి కాలు దువ్వేవారికి కాల- యమస్వరూపుడూ ఐన ఆ యయాతికిచ్చి వివాహం జరిపించాడు. అప్పుడే శుక్రుడు, శర్మిష్ఠతో శరీర సంపర్కం కూడదని యయాతికి నియమం విధించి పంపుతాడు. శుక ఉవాచ- రాజా! అనంతరకాలంలో దేవయానికి యయాతి వలన యదువు, తుర్వసుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. దూరదృష్టి లేకుండా శర్మిష్ఠ వంటి సౌందర్యరాశిని దాసిగా తన అంతఃపురంలో ఉంచుకోవడం దేవయాని చేజేతులా, అంతిమంగా చేసుకున్న తప్పు! ‘పొలతి దావవహ్ని పురుషుడాజ్యఘటంబు’- (మండుతున్న అగ్ని జ్వాల నారి, నిండైన నేతికుండ నరుడు) అన్న న్యాయం సార్థకమైంది. ఒకనాటి రాత్రి దేవయాని వెలుపల ఉండగా, శర్మిష్ఠ ఏకాంతంగా ఉన్న యయాతిని కలిసి ‘నాకూ నీవే అండ’ అంటూ వలరాజు (మన్మథుని) పూల కోలల (బాణాల)కు తాళలేక అచ్చమైన తన వలపు తలపును వెలిబుచ్చింది. పుత్రభిక్ష పెట్టమని అర్థించింది. సముచితంగా భావించిన ధర్మవేత్త యయాతి అందుకు సమ్మతించాడు. యయాతి వలన శర్మిష్ఠ ద్రుహ్యుడు, అనువు, పూరువు అనే ముగ్గురు పుత్రులను కన్నది.
ఈ రహస్యం బయటపడి దేవయాని ఆగ్రహంతో తండ్రి గృహం చేరింది, దేవయానిని అనుసరిస్తూ వెళ్లిన యయాతి ఆమెతో.. ‘ఓ తామరసాక్షీ (పద్మాక్షీ)! ఈ సంగతి మామగారి దాకా ఎందుకు? చెప్పమాక. నీకు ఊడిగం చేసే రాక్షసుని కూతురిని- శర్మిష్ఠను కూడి నేను తప్పు చేశాను. అయినా ఓ సుదతీ (మంచి పల్వరస గలదానా)! నీ యందు అత్యంత రతి కల నన్ను అనుగ్రహించు. సతికి పితరుని మాటకన్నా పతి మాటే సమ్మతింప దగింది కదా!’ అంటూ పాదాల మీద పడ్డా ఆ పడతి ఆమోదించలేదు. విషయం తెలుసుకున్న శుక్రుడు ఆగ్రహంతో అనాలోచితంగా ‘ఓ యయాతీ! యవ్వన మదంతో మాట తప్పావు గాన నీవు మగువలు (స్త్రీలు) ఏవగించుకొనే అతి బీభత్సమైన ముదిమి (ముసలితనాన్ని) పొందుదువు గాక’ అని శపించాడు. ఈ రీతి శాపం ఎంతో ప్రియమైన తన పుత్రికకే సంతాప కారకమని అంతగొప్ప నీతిశాస్త్ర కోవిదునికి కూడా తోచకపోవడం ఆశ్చర్యం!
(సశేషం)