మూలంలో కాలయవన నారద సంవాదం కానరాదు. జరాసంధుని చివరి- 18వ దాడికి ముందు ‘నారద ప్రేషితో వీరో యవనో ప్రత్యదృశ్యత’- నారదుడు పంపిన యవన వీరుడు కనిపించాడని మాత్రమే ఉంది. కాని, తెలుగులో- యవనుడు కోరగా నారద ముని గావించిన మారజనకుని, యదువీరుని సింగారపు స్వరూప స్వభావ వర్ణన అమాత్యుని ఇంపెసలారే- అందమైన పెంపుదలగా వెలుగు చూసింది. జగత్కల్యాణ కారకుడైన కలహప్రియుడు నారదుడు కాలయవనునితో..
సీ॥ ‘నీల జీమూత సన్నిభ శరీరము వాడు,
తామరసాభ నేత్రముల వాడు
పూర్ణేందు బింబంబు బోలెడి మోమువా,
డున్నత దీర్ఘ బాహువుల వాడు
శ్రీవత్స లాంఛనాంచిత మహోరము వాడు,
కౌస్తుభ మణి పదకంబు వాడు
శ్రీకర పీత కౌశేయ చేలము వాడు,
మకర కుండల దీప్తి మలయు వాడు
తే॥ రాజ! ఇంతింత వాడనరాని వాడు
మెఱసి దిక్కుల నెల్లను మెరయు వాడు
తెలిసి యే వేళలందైన దిరుగు వాడు
పట్ట నేర్చిన కాని లోబడని వాడు’…
‘యవనేశ్వరా! ఆ భువనేశ్వరుడు నీల మేఘశ్యాముడు. నాళీక- కమలాల వంటి కన్నులు కలవాడు. పూర్ణచంద్రుని వంటి మోము వాడు. ఆజానుబాహువు. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో చూపట్టు (కనిపించు) విశాలమైన వక్షఃస్థలం కలవాడు. కంఠంలో కౌస్తుభమణి కాంతులీనుతూ ఉంటుంది. సంపత్కరమైన పసుపు పచ్చని పట్టు పుట్టాలు ఆకట్టుకుంటాయి. చెవులలో మకర కుండలాలు చెలువు (అందం)గా కరము (మిక్కిలి) వెలుగుతుంటాయి. ఇంతవాడు, అంతవాడని ఎంతవాడైనా కొంతైనా చెప్పలేని వింత పోకడలతో అంతుచిక్కని వాడు. తాను వెలుగుతూ అన్ని దిక్కులను వెలుగుతో నింపువాడు. త్రికాలా బాధ్యుడు- అన్ని వేళలలో అంతటా వర్తించు- వసించు సర్వవ్యాపకుడు. పట్ట నేర్చిన వానికే కాని లోపడని- పట్టుబడని, లోగుట్టు తెలియని వాడు’. శుకముని- అవనీపతీ! నారదముని ఇలా కృష్ణుని రూపురేఖలు వర్ణించగా విని యవనుడు- ‘ముని పుంగవా! యాదవుడనగా ఎంతవాడు? ప్రళయాంతకుడైనా తల ఒగ్గక నన్నెదిరిస్తే కదనంలో అతనిని నా నిశితమైన అస్ర్తాల అగ్గిమంటలలో బుగ్గి చేస్తా’ అని నారదునితో వీరోక్తులాడి, మూడు కోట్ల మ్లేచ్ఛ (మలేచ్ఛులే- మలమును ఆశించువారే మ్లేచ్ఛులు) వీరులను కూర్చుకొని మథురాపురిని ముట్టడించాడు.
అది కని (చూచి) అనిరుద్ధుడు (ఎవ్వని చేతనూ అడ్డగింపబడని) కృష్ణుడు బలరామునితో ఇలాగని ఆలోచించాడు… ‘అన్నా! కాలయవనుడు అకాలంలో నగరాన్ని ఆక్రమించాడు. ఈ రోజో, రేపో మగధ రాజు కూడ మనపై దాడి చేయవచ్చు. కాలయవన జరాసంధులిద్దరూ చాలా గద్దరులు- గర్వపోతులు. వారు పురానికి ఇరువైపులా చేరి పోరు సలుపుతారు. మనం శక్తి కొలదీ ఒకడిని ఢీకొంటే, మరొకడు సందు చూసుకొని మన బంధువులందరినీ పట్టి చంపవచ్చు లేదా పట్టుకుపోయి చెర బెట్టవచ్చు. జరాసంధుని పరాక్రమం అతిక్రూరం. కనుక, పోరుకు వీలుగాని తీరుగా దుర్గమ (చొరరాని) ప్రదేశంలో ఒక దుర్గం- కోట కట్టించుకొని, అందులో మన వారందరినీ చేర్చుదాము.’ ఇలా పరామర్శించి మురారి సాగరుని అడిగి పశ్చిమ వారిధి (సముద్రం) మధ్యలో పన్నెండు ఆమడల (8 లేక 10 మైళ్ల దూరం) పొడవు, అంతే వెడల్పు గల దుర్గమ ప్రదేశాన్ని సంపాదించి, మధ్యలో దేవశిల్పి విశ్వకర్మచే ఒక అపురూపమైన పురం నిర్మించుకొన్నాడు. ఆ నగరం వరుణుని శ్రద్ధావతి, ఇంద్రుని అమరావతి, కుబేరుని అలకాపురి, యముని సంయమనీ నగరాల కంటె, ఇంకా బ్రహ్మదేవుని సత్యలోకం కంటె సుదృఢమైనది. అదే ద్వారకా నగరం- నిరంజనుని నిత్య నివాసం. పరమాత్ముని పరంధామం. నవద్వారాలు కలిగి ఉన్న మానవ దేహమే సాధన ధామము, మోక్ష ద్వారమూ అయిన ద్వారక. విశేషంగా, శిరస్సుపై ఉన్న దశమ రంధ్రం బ్రహ్మరంధ్రం. అదే బ్రహ్మ ప్రవేశ ద్వారం. ఆ ద్వారం కలిగినదే ద్వారవతి- ద్వారక! శ్రీకృష్ణావతార లీలా ప్రారంభ స్థలి వ్రజభూమి- గోకుల బృందావనం. లీలా సంవరణ- సమాపన స్థలి కుశస్థలి- ద్వారక. ‘దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా’ (విష్ణు సహస్ర నామం)- దుర్లభమూ, దుర్గమమూ అయిన దుర్గమే ద్వారక! సాగర మధ్యంలో దుర్గం. అందున సర్వాశ్చర్యకరమైన నగరం. అర్ణవం (సముద్రం)లో స్వర్ణద్వారక. సృష్టిలోని వాస్తుకళ, విజ్ఞాన ప్రజ్ఞానానికి పరాకాష్ఠ!
క॥ ‘శ్రీకరములు జన హృదయ వ
శీకరములు మందపవన శీర్ణ మహాంభ
శ్శీకరములు హంస విహం
గాకరములు నగరి కువలయాబ్జాకరముల్’
ఆ ద్వారకాపురిలోని సరస్సులు కలువలు, కమలాల శోభతో కళకళ్లాడుతుంటాయి. అవి పురజనుల హృదయాలను వశీకరించుకొని పరవశింపజేస్తాయి. పిల్లగాలులచే చెదరగొట్ట బడుచున్న చల్లని నీటి తుంపరల జల్లులతో విలసిల్లుతూ- ఒప్పుతూ, కలహంస, సారస (బెగ్గురు) మొదలైన విహంగా (పక్షు)ల విహారాలకు నిలయాలై ఉల్లములను ఉల్లసింప- రంజిల్ల చేస్తుంటాయి.’ ఇది మొదలు ఇక ముందటి ‘కంద నవకము’ నందు- తొమ్మిది కంద పద్యాలలో ముకుందుని ద్వారకా నగర అందచందాలను, అధ్యాత్మ సంపదలను కవి చందురుడు పోతన సుందరంగా పొందుపరచాడు.
క॥ ‘ఆ వీటి నుండు వారికి
భావింపగ లేవు క్షుత్పిపాసాదులు త
ద్గోవింద కృపావశమున
దేవ ప్రతిమానులగుచు దీపింతురిలన్’
ఆ ద్వారకలోని ప్రజలకు క్షుత్పిపాసలు- ఆకలిదప్పులు ఉండవు. కృపారసం పైన చల్లే నల్లని వాని- కృష్ణుని చల్లని చూపులతో వారెల్లరూ దేవతలతో సమానంగా తేజరిల్లుతూ ఉంటారు.
సీ॥ ‘ఆసక్తి కృష్ణ ముఖావలోకనమంద,
హరిపాద సేవన మంద చింత
వెఱపు నారాయణ విముఖ కార్యములంద,
పారవశ్యము విష్ణుభక్తియంద
బాష్ప నిరతి చక్రి పద్య సంస్తుతులంద,
పక్షపాతము శార్ఞి భక్తులంద
లేమి గోవిందాన్య లీలా చరణ మంద,
శ్రమము గోవింద పూజనములంద
తే॥ బంధ మచ్యుతేతర దుష్ట పథములంద
జ్వరము మాధవ విరహిత క్షణములంద
మచ్చరము లీశ కైంకర్యమతములంద
నరవరోత్తమ! వినుము తన్నాగరులకు.’
శుకుడు.. ‘పరీక్షిన్మహారాజా! ద్వారకావాసులకు వాసుదేవుని వదనారవింద సందర్శన మందే ధ్యాస (ధ్యానం). యాదవ శిరోరత్నం- మాధవుని పదారవింద సేవ యందే వారి యావ (ఆసక్తి). పరమాత్మకు ప్రతికూలమైన కృతులు- పనులంటేనే వారికి అతిభయం. దానవారి- అసురాంతకుని అసలైన భక్తియందే వారికి పారవశ్యం- వెరపులేని మైమరుపు. శ్రీకృష్ణుని పద్యాలతో- స్తోత్రాలతో కీర్తించే సమయంలో వారి కళ్లలో ఆనందబాష్పాలు పరవళ్లు తొక్కుతాయి తప్ప, వారు లౌకికమైన మరి దేనికీ కన్నీళ్లు పెట్టరు. కైటభారి శౌరి- కృష్ణుని భక్తుల యందే వారికి అవ్వారి- భూరిగా గౌరవాభిమానాలు. దైవేతర- సాంసారిక కార్యాలలో తప్ప, దైవ- కంసారి కృష్ణుని కార్యాలలో లేమిడి- లోటు, దారిద్య్రం రానివ్వరు. వారి శ్రమ అంతా ఉరుక్రముని- కృష్ణుని పూజించడంలోనే. దామోదరుని దరి- సమీపానికి చేర్చలేని చెడు మార్గాలే వారికి చెర- బంధం. మాధవుని క్షణకాల వియోగం కూడా వారికి జ్వరం- తీవ్ర సంతాప కారణం. పురుషోత్తముని పరిచర్యలు- సేవలు చేయడంలోనే వారికి పట్టుదల.’ మన మనోబుద్ధులు, మన దైనందిన ఆచార వ్యవహారాలూ ఇలా ఉంటే, మనం ద్వారకలో దామోదరుని సన్నిధిలో ఉన్నట్లే! పోతన గారి పై సొంత సీస పద్యం ఆయన నిశ్చింత ప్రశాంత దైనిక ‘చారుచర్య’కు తీరుగా- చక్కగా అద్దం పడుతుంది.
మథురానాథుడు శ్రీహరికి మహేంద్రుడు పారిజాత వృక్షాన్ని, ‘సుధర్మ’ అను దేవసభను కానుకగా ఇచ్చాడు. కృష్ణుడు తన యోగశక్తిచే మథురా నగర ప్రజలందరినీ ద్వారకకు చేర్చాడు. అనంతరం అన్నగారి అనుమతితో ‘సర్వప్రహరణాయుధుడు’ (పరమాత్మ అస్త్రశస్ర్తాలకు మితి లేదు. ప్రహరించే- దెబ్బతీసే అన్ని వస్తువులు ఆయనకు ఆయుధాలే!) అచ్యుతుడు నిరాయుధుడై నగరం వెలువడి తనకు ఎదురుగా రావడం కాలయవనుడు చూచాడు.
కం॥ ‘విభులగు బ్రహ్మ ప్రముఖుల
కభిముఖుడై నడవకుండు నట్టి గుణాఢ్యుం
డిభరాజ గమన మొప్పగ
నభిముఖుడై నడిచె గాలయవనున కధిపా!’
శుకుడు- రాజా! బ్రహ్మాది దేవతలకు కూడా అభిముఖం-
ఎదురుగా నడవని, అనంత కల్యాణ గుణ సంపన్నుడైన నారాయణుడు ఇభరాజ- కరిరాజు నడక వంటి నడకతో కాలయవనునికి ఎదురుగా నడిచాడు. మూలంలో ‘దురాపమపి యోగినాం’ (యోగులకు కూడా దుర్లభుడు) అని మాత్రమే ఉన్న మాటని పై కందంలో మన అమాత్యుడు పోతన్న, తన కవన చేతన కన్న విధంగా తేనె ఊటగా ఇలా తేట పరచాడు. నారదుడు సూచించిన సారసాక్షుడు (పద్మనేత్రుడు) సోముని వంటి మోముగల రామానుజుడు శూరుడు వీడే అని నిర్ధారించుకొని కాలయవనుడు మిక్కిలి కావరం (మదం)తో, ఆలము- అనాదరం చేస్తూ వ్యాల (కాళీయ) మర్దనుని పట్టుకోవాలని మిడిసిపడ్డాడు. ఇలా తనను పట్టడానికై యవనుడు రాగా నవకంజ లోచనుడు, నందుపట్టి కేశవుడు పట్టుపడకుండా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా మిక్కిలి వడిగా పరుగెత్తసాగాడు.