Annamacharya | అది నరసింహుడు స్తంభోద్భవుడిగా హిరణ్యకశిపుణ్ని వధించి, ప్రహ్లాదుణ్ని కాపాడిన అనంతర ఘట్టం. దేవతలు, మునులు, గంధర్వులు, విద్యాధరులు, మానవులు ఆయన బలానికి ‘అహోబలం అహోబలం’ అని జయజయ ధ్వానాలు పలుకుతున్నారు. బంగారు మేడలోపల, పచ్చల గద్దెమీద నరహరి కొలువుదీరాడు. అదీ తొడపై లక్ష్మీదేవిని నిలుపుకొని మరీ. ఆ వైభవాన్ని, అక్కడి సందోహాన్ని, స్వామి రాజసాన్ని… ‘ఆరగించి కూచున్నా డల్లవాడే…’ అంటూ అక్షరీకరించాడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ లక్ష్మీనరసింహుడి వైభవం ఎలా ఉందో ఆలకించండి మరి…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం విమాన ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు ఉండే చిన్న నిర్మాణం యోగనరసింహ స్వామి ఆలయం. ఈ నిర్మాణం 15వ శతాబ్దం నాటికే ఉన్నట్లు తెలుస్తున్నది. అన్నమయ్య సంకీర్తనల ద్వారా కూడా ఆ విషయం నిరూపణ అవుతుంది. కాగా, ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉన్నప్పటికీ యోగనరసింహ స్వామికి నిత్య పూజలు ఉండవు. కానీ, నిత్య నైవేద్యం మాత్రం ఉంటుంది. శనివారం పూజలు, నివేదనలు జరుగుతాయి. నృసింహ జయంతి నాడైతే విశేష పూజలు, నైవేద్యాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఒక పర్యాయం నైవేద్యం అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చేరువగా యోగపట్టెంతో గద్దెమీద కూర్చున్న నరసింహుణ్ని చూసిన అన్నమయ్య ఒకరకమైన అలౌకిక అనుభూతికి తప్పకుండా లోనై ఉంటాడు. ఆ తాదాత్మ్యత నుంచి ఆశువుగా వచ్చిందే ఈ ‘ఆరగించి కూచున్నాడు..’ కీర్తన.
ఆరగించి కూచున్నా డల్లవాడే
చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు
ఆ నరహరి సకల సంపదలకూ మూలమైన ఇందిరను తొడమీద కూర్చొబెట్టుకుని కొలువుదీరాడట. అంతేనా అందంగా నవ్వులు వెదజల్లుతున్నాడట. అలా పడగల మీద మాణిక్యాలను దాల్చిన శేషుని మీద కూర్చొని తనను శరణు జొచ్చిన వారికి వరాలు ఇస్తున్నాడు లక్ష్మీనరసింహుడు. ఈ దృశ్యాన్నే అన్నమయ్య కింది విధంగా తొలి చరణంగా మలచాడు.
ఇందిరను దొడమీద నిడుకొని కొలువిచ్చి
అందపు నవ్వులు చల్లీ నల్లవాడే
చెందిన మాణికముల శేషుని పడగె మీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు
శేష పానుపుపై బంగారు మేడలలోపల కొలువున్నాడు నరహరి. అలా కూర్చొని పచ్చల గద్దెల మీద అప్సరసలు ఆడుతుంటే చూస్తూ విలాసం ఒలకబోస్తున్నాడు. చూడ ముచ్చటైన సొమ్ములను అలంకరించుకొని, రాజసపు వైభవాన్ని ప్రదర్శిస్తూ మనకు సమీపంలోనే ఉన్నాడట లక్ష్మీనరసింహుడు. త్రిమూర్తులలో విష్ణువు రజో గుణ ప్రధానుడు. ఈవిధంగా బంగారు మేడలలోపలి వైభవాన్ని పదకవితా పితామహుడు రెండో చరణంలో వివరించాడు.
బంగారు మేడలలోన పచ్చల గద్దియల మీద
అంగనల యాట చూచీ నల్లవాడే
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నడా లక్ష్మీనారసింహుడు
* **
కాగా ఇందిరను ఎడమ తొడమీద నిడుకున్న నరసింహ స్వామి కూర్చున్న భంగిమ కూడా విశేషమైందే. ఆయన గండపెండేరం అలంకరించుకున్న కుడికాలు పాదాన్ని కిందికి చాచి పెట్టి, మరో కాలును పెనచి మెలిదిప్పి పూజలు అందుకుంటున్నాడట. ఆ లక్ష్మీనరసింహుడు ఏడుకొండల కొలువు కూటమైన శ్రీవేంకటాద్రి, అహోబల క్షేత్రంలో గొప్పగా శోభిల్లుతూ ఉన్నాడు. దీనినే మూడో చరణంలో వర్ణించాడు అన్నమయ్య. అయితే క్షేత్రం తిరుమలనా, అహోబిలమా, యాదాద్రా అన్నది అలా ఉంచితే ప్రతీచోటా భక్త సులభుడైన ఆ లక్ష్మీనరసింహుడు తనను ఆశ్రయించిన అందరికీ వరాలు ఇస్తూ వైభవంగా అలరారుతున్నాడు.
పెండెపు బాదము చాచి పెనచివో పాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి గోరి యహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు
* * *
మూడు చరణాలలో రెండో పాదంలో ‘అల్లవాడె’ అనే పదం ప్రయోగించడం విశేషంగా కనిపిస్తుంది. మామూలుగా అయితే అల్లవాడె అంటే ఆయనే (లక్ష్మీనరసింహుడే) అని అర్థం. అల్ల అంటే నిఘంటువులో గొప్ప, ప్రసిద్ధిచెందిన అనే అర్థాలు ఉన్నాయి. అంటే స్వామి గొప్పవాడు అని విశేషార్థంగా తీసుకోవచ్చు. ఇక ‘నల్లవాడె’ అని తీసుకుంటే విష్ణువు అవతారంగా లక్ష్మీనరసింహుడు ‘నల్లవాడు’ అని చమత్కారం. ఈ విధంగా శ్రీమహావిష్ణువు అవతారాల్లో నాలుగోవాడైన నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై బంగారు మేడలలో వైభవోపేతంగా విరాజిల్లుతున్న వైనాన్ని మూడు చరణాలలో మురిపెంగా కండ్లకు కట్టాడు అన్నమాచార్యులు.
అన్నమయ్య (15వ శతాబ్దం) సొంత ఊరు రాజంపేట సమీపంలోని తాళ్లపాక. ఆయనకు తిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా కలలో వచ్చి రోజుకొక్క సంకీర్తనయినా రాయమని ఆదేశించాడట. ఆ మేరకు పరమమంత్రాలైన 32,000 సంకీర్తనలను స్వామికి అంకితంగా రాశాడని తెలుస్తున్నది. అన్నమయ్య ఏ క్షేత్రానికి వెళ్లినా అది ఆయనకు తిరుమలే. ఆయా క్షేత్రాల్లో కొలువైన నరసింహుడు, రాముడు, కృష్ణుడు, చెన్నకేశవుడు, విఠలుడు.. ఎవ్వరిని కొలిచినా ఆ దైవం సాక్షాత్తూ తిరుమలేశుడే. తెలుస్తున్నంత వరకు అన్నమయ్య తన క్షేత్ర సందర్శనలో కృష్ణానదికి ఉత్తరం వైపు వచ్చినట్లు అనిపించదు.
– చింతలపల్లి హర్షవర్ధన్