మహాభారతంలో మహామహాయోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కాని, ఒక్క కృష్ణభగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథసారథిగానే ఉన్నట్లు కనిపించాడు. మహాసంగ్రామాన్ని ఓ సాక్షిలా గమనించాడు. కాని, ఆ రణరంగమంతా ఆ రుక్మిణీనాథుడి కనుసన్నల్లోనే ముందుకు సాగిందన్నది జగద్విదితం. అకర్మలో తీవ్ర కర్మ దాగి ఉంటుందనటానికి అంతకుమించి తార్కాణం లేదు. ఇదే విషయాన్ని బర్బరీకుడి వృత్తాంతం తెలియజేస్తుంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో దేశంలోని రాజులందరూ కౌరవ, పాండవ పక్షాలలో చేరారు. యోధానుయోధుడైన బర్బరీకుడు కూడా కురుక్షేత్రం చేరుకుంటాడు.
ఏ పక్షం బలహీనంగా ఉంటే అందులో చేరుతాను అంటాడు బర్బరీకుడు. యుద్ధంలో బలాబలాలు మారుతూ ఉంటాయి. బర్బరీకుడు ఎవరి పక్షం వహించినా యుద్ధం ఫలితం తేలదు. కాబట్టి, శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఇవ్వమని కోరుతాడు. అయితే మొండెం నుంచి వేరైన తన తల కురుక్షేత్ర యుద్ధాన్ని చూసేలా వరం కోరుతాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు సరేనంటాడు. అలా బర్బరీకుడి శిరస్సు కురుపాండవ సంగ్రామం అంతా వీక్షిస్తుంది. యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు బర్బరీకుడి శిరస్సుతో ‘యుద్ధం చూశావా?’ అని అడుగుతాడు. అప్పుడు బర్బరీకుడు ‘దేవా! యుద్ధం జరిగినన్ని రోజులూ కురుక్షేత్రంపై గిరగిర తిరిగిన నీ సుదర్శన చక్రం తప్ప నాకు మరేమీ కనిపించలేదు’ అంటాడు. ఏం చేయకున్నా.. అంతా శ్రీకృష్ణుడే చేశాడు అనడానికి నిదర్శనమిది.