ప్రముఖ పట్టణంలో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీవాసులు ప్రతి గురువారం ఉదయం సంప్రదాయ దుస్తులు ధరించి కాలనీలో అన్ని వీధులూ తిరుగుతూ నగర సంకీర్తన చేస్తారు. డోలు, తబలా, చిడతలు, మృదంగం లాంటి వాయిద్య పరికరాలతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందు నడిచే వ్యక్తి గట్టిగా భక్తి గీతాలను పాడుతూ ఉంటే మిగిలిన వారు అనుకరిస్తూ ఉంటారు. వారానికొకసారి ఉదయాన్నే భక్తి పాటలు పాడుకుంటూ నగర సంకీర్తన చేయడం వల్ల భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయని చాలామంది గృహిణులు కూడా అందులో పాల్గొంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచరమ్మ కొత్తగా ఆ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. చేరిన మరుసటి రోజే ఆ టీచరమ్మ శుభ్రంగా స్నానం చేసి ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తున్నది. అదే సమయంలో నగర సంకీర్తన జరుగుతున్నది. నగర సంకీర్తన చేసే బృందంలోని ఒక మహిళ ఆ టీచరమ్మ ఇంటి ముందు ఆగి ‘మీరు కూడా నగర సంకీర్తనకు’ రండి అని పిలిచింది. ‘నగర సంకీర్తన చేస్తే ఏమి లాభం?’ అని ప్రశ్నించింది టీచరమ్మ.
బృందంలోని మహిళ తులసి చెట్టు ముందు ఉన్న దీపాన్ని చూపిస్తూ ‘దీపానికి గాజు చిమ్నీ ఎందుకు పెట్టారు?’ అని ఎదురు ప్రశ్న వేసింది. ‘అది కూడా తెలియదా’ అన్నట్టుగా ముఖం పెట్టి ‘గట్టిగా గాలి వీస్తే దీపం ఆరిపోతుంది. దీపం ఎక్కువసేపు వెలగాలని చిమ్నీ పెట్టాను’ అని సమాధానమిచ్చింది టీచరమ్మ. బృందంలోని మహిళ చిన్నగా నవ్వి ‘దీపం ఆరకూడదని చిమ్నీ ఎలా పెట్టారో, అలాగే మనలోని ఆధ్యాత్మిక దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే, పుణ్యక్షేత్రాల దర్శనం, ఉత్తమ గ్రంథాల పఠనం, భజన, నగర సంకీర్తన లాంటివి చేయాలి. నాలుగు వారాలు మాతో రండి. తేడా మీకే తెలుస్తుంది’ అని చెప్పింది. ‘నిజమే.. మనం మన పనుల్లో పడి భజన చేయడాన్ని పక్కన పెడుతున్నాం. అదే ఒక బృందంగా కలిసిచేయడం ప్రారంభిస్తే కచ్చితంగా కొనసాగిస్తాం’ అని గుర్తించిన టీచరమ్మ వెంటనే బృందంలో కలిసిపోయింది. వీధి మలుపు తిరిగేలోగా పక్కనున్న వారిని అడిగి చిడతలను చేతిలోకి తీసుకుంది.