తెలుగువారమైన మనం అనుసరించేది ‘చాంద్రమానం’. అంటే చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని కాలగణన చేయడమే చాంద్రమానం. అమావాస్య తర్వాతి రోజు నుంచి నూతన మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు సన్నగా కనిపించడం ప్రారంభిస్తాడు. ఇలా పదిహేను రోజులు చంద్రుడు పెరుగుతూ సంపూర్ణుడవుతాడు. చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజు పౌర్ణమి. పౌర్ణమి మరుసటి దినం నుండి చంద్రుడు సన్నగిల్లడం ప్రారంభమై అమావాస్యనాటికి పూర్తిగా కనబడకుండా పోతాడు. చంద్రుడు పెరుగుతూ వున్న పక్షం- శుక్లపక్షం. తరుగుతూ వున్న పక్షం – కృష్ణపక్షం. ఈ రెండూ కలిపితే ఒక చాంద్రమాన మాసం. ఒక్కోనెలకు 29 1/2 రోజులు. అంటే చంద్రుడు ఒకసారి భూమిని చుట్టివచ్చేందుకు ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది. అంటే చాంద్రమాన సంవత్సరంలో మొత్తం 354 రోజులు ఉంటాయి.
ఇక సూర్యమానం ప్రకారం వుండే సంవత్సరానికి 365 1/4 రోజులు. వీటిని బట్టి చాంద్రమాన సంవత్సర లెక్కింపునకు, సౌరమాన సంవత్సర లెక్కింపునకు మధ్య దాదాపు 11 రోజులు తేడా వస్తుంది. అంటే సౌరమాన సంవత్సరం కంటే చాంద్రమాన సంవత్సరంలో 11 రోజులు తక్కువగా వస్తాయి. ఈ తేడాను సరిదిద్ది, చాంద్రమాన సౌరమాన సంవత్సరాలను సమన్వయం చేసేందుకు మన ఖగోళ శాస్త్రవేత్తలు అధిక మాసాన్ని ఏర్పాటు చేశారు. వేదకాలంలోనే మన పూర్వికులు ఈ ఏర్పాటు చేయడమనేది ఖగోళ శాస్త్ర నైపుణ్యానికి చిహ్నం.
అధిక మాసాన్ని నిర్ణయించేందుకు సూర్యమానాన్ని ఆధారంగా చేసుకోవడం జరిగింది. ప్రత్యక్ష భగవానుడు అయిన ఆదిత్యుడు ప్రతినెలా ఒక రాశిలోనుంచి మరొక రాశిలోనికి మారుతూ ఉంటాడు. దీనికే ‘సూర్య సంక్రమణం’ అని పేరు. ప్రతి చాంద్రమాన మాసంలో సూర్య సంక్రమణం జరుగుతుంది. అయితే ఏ నెలలో అయితే సూర్య సంక్రమణం జరగదో… ఆ నెలను అధికమాసంగా నిర్ణయించారు. అధికమాసం సాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఒక నియమిత కాలంలో క్రమపద్ధతిలో అధికమాసం వస్తుంది.
అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. దీనికి మలమాసం అని కూడా పేరు వుంది. దీనినే కొన్ని ప్రాంతాలలో మైలమాసం అని కూడా అంటారు. అధికమాసం శుభకార్యాలకు పనికిరాదని శాస్త్రవచనం. అయితే పురుషోత్తమ మాసం అని పేరు ఏర్పడటం వెనుక ఓ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం శుభకార్యాలకు పనికి రాని మాసం అని అందరూ తనను చిన్న చూపు చూస్తున్నారని బాధపడిన అధికమాస దేవత శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తన బాధను వెల్లడించిందట. అప్పుడు విష్ణు భగవానుడు ‘నీకు అధిదేవత, ప్రత్యధి దేవతలు ఎవరూ లేరు. ఇక మీదట నీకు నా పేరుమీదనే పురుషోత్తమ మాసం’ అన్న నామం స్థిరపడుతుంది’ అని వరమిచ్చాడట. అంతేకాదు ‘అధిక మాసంలో నన్ను అర్చించినవారు, వ్రతం చేసినవారు, దాన ధర్మాలు చేసినవారు నా కృపకు పాత్రులై ఇహంలో సౌఖ్యం, పరంలో ఉత్తమ లోకాలను పొందుతారు’ అని శ్రీ మహావిష్ణువు అధికమాసానికి వరం ప్రసాదించాడని పురాణ కథనం. అప్పటి నుంచి అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ఏర్పడింది.
శుభకార్యాలకు పనికిరాదని చెప్పినా.. ఈ అధికమాసంలో సంధ్యానుష్టానం, దేవతార్చన వంటి నిత్యకర్మలు, ఏకాదశి, మాస శివరాత్రి వంటి నైమిత్తిక వ్రతాలను యథావిధిగా ఆచరించాలి. గ్రహశాంతులు, అన్నదానం లాంటివి నిరభ్యంతరంగా చేయవచ్చు. దేవాలయాల పునః ప్రతిష్ఠలను చేయవచ్చు. ఆబ్దికం వంటివి వస్తే అధిక, నిజమాసాల్లో రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. అధికంలో ‘ఏకాదశి వ్రతం’ ఆచరించవచ్చు. అధిక జ్యేష్ఠంలో వచ్చే శుక్ల ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడంతోపాటు ఉపవాస జాగరణలు పాటించాలి. మరుసటి రోజు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనం చేయాలి. ఇక కృష్ణ పక్ష ఏకాదశిని కమల ఏకాదశి అంటారు. పద్మినీ ఏకాదశి వలనే.. ఈరోజూ ఉపవాస, జాగరణలు పాటించడంతోపాటు ఆవు నెయ్యిని దానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని నమ్మిక.
అధిక మాసంలో దేవతలందరి ప్రీత్యర్థం ప్రధానంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం అధిక మాస వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. పద్మ, భవిష్యోత్తర పురాణాలలో ఈ వ్రత విధానం గురించి సవిస్తరంగా కనిపిస్తుంది. ఈ వ్రతం ఆచరించే వారు పూజా పీఠంపై శ్రీ లక్ష్మీనారాయణుల చిత్రపటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకుని అందులోకి స్వామివారిని ఆవాహన చేసుకోవచ్చు. తర్వాత షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజ చేసి ముప్పైమూడు అప్పాలు, బెల్లం, బియ్యం, నెయ్యి కలిపి వండిన బెల్లం పొంగలి ఒక కంచుపాత్రలో ఉంచి నివేదన చేయాలి. ఆయా పురాణాల్లో పేర్కొన్న విధంగా వ్రతం కొనసాగించాల్సి ఉంటుంది. అధికమాస వ్రతం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం.
– డాక్టర్ ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖర రావు