e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home చింతన వైదిక శిక్షణ ధార్మిక రక్షణ

వైదిక శిక్షణ ధార్మిక రక్షణ

దక్షిణాపథంలో సుబ్రహ్మణ్య తత్వం అణువణువూ పరిఢవిల్లుతూ ఉంటుంది. ఆ షణ్ముఖుడి దివ్యక్షేత్రాలు దక్షిణ భారతంలో ఎన్నో! అందులో ప్రముఖమైనది కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం. ఈ దివ్యక్షేత్రంలో వెలసిన భవ్య పీఠం ‘సంపుట నరసింహస్వామి సుబ్రహ్మణ్య మఠం’. దీనికి 40వ పీఠాధిపతిగా ఉన్నారు శ్రీశ్రీశ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామి. ధర్మప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన స్వామిని ‘చింతన’ పలకరించింది. సుబ్రహ్మణ్య తత్వాన్ని, కుక్కి క్షేత్ర వైభవాన్ని, మఠం నిర్వహిస్తున్న వైదిక, సామాజిక కార్యక్రమాల విశేషాల గురించి స్వామివారు పంచుకున్న వివరాలు ఇవి..

ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మికతకు పట్టుగొమ్మ కర్ణాటకలోని కుక్కి క్షేత్రం. పడమటి కనుమల్లో నింగిని పొడుచుకున్నట్టుండే కుమార పర్వతం, దాని పైనుంచి జాలువారిన కుమారధార నది ఈ క్షేత్రాన్ని మనోహరంగా కండ్ల ముందుంచుతాయి. ఆ పర్వత సానువుల్లో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి కోవెల అచంచలమైన శక్తి కేంద్రంగా భాసిస్తున్నది. దానికి వెనుక ఉండే ఆది సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కోటి కాంతులతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. పౌరాణిక, ఐతిహాసిక ప్రాశస్త్యం ఉన్న ఈ కుక్కి క్షేత్ర దర్శనం జన్మకో అదృష్టం. సుబ్రహ్మణ్యుడు ఇక్కడి కుమార పర్వతంపై జన్మించాడని స్థల పురాణం చెబుతున్నది. అనంత శక్తికి ఆలవాలమై అలరారుతున్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి నిత్యం వేలాది మంది యాత్రికులతో కళకళలాడుతుంటుంది.

- Advertisement -

తారకాసురుడు మహా తపశ్శక్తి సంపన్నుడు. వరగర్వంతో అతడి బుద్ధి వక్రీకరిస్తుంది. సజ్జనులను పీడించడమే పనిగా పెట్టుకుంటాడు. దేవతలను హింసించడం ప్రవృత్తిగా మార్చుకుంటాడు. అతడి నుంచి తమను కాపాడాల్సిందిగా దేవతలంతా శక్తితో మొరపెట్టుకుంటారు. శక్తి అనుగ్రహంతో ఆవిర్భవిస్తాడు సుబ్రహ్మణ్యుడు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనాధిపతిగా పట్టాభిషిక్తుడిని చేస్తారు. దేవసేనలకు అధినాయకుడిగా తారకాసురుడితో యుద్ధం చేస్తాడు కార్తికేయుడు. ఆ అసురుణ్ని సంహరించి లోకాలను రక్షిస్తాడు. సజ్జనుల క్షేమం కోసం ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. శక్తి కుమారుడికి ఇచ్చిన శూలాన్ని.. జ్ఞానశూలం అనడం వెనుక ఆంతర్యం కూడా ఇదే!

పాము.. నెమలి..
సుబ్రహ్మణ్యస్వామిని సర్పాలకు మూలదేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి. రెండు విరుద్ధ భావనలను, ధర్మాలను ఒక్కతాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉంది. అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు. కుమారపర్వతంపై వెలసిన సుబ్రహ్మణ్యస్వామి సర్పరాజును రక్షించడానికే కుక్కి క్షేత్రానికి తరలి వచ్చాడట. గరుడుని నుంచి ప్రాణరక్షణ కావాల్సిందని సర్పరాజు కోరగా.. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహించాడని చెబుతారు. అలా నాగరాజు మూలస్థానంలో సుబ్రహ్మణ్యుడు అవతరించాడని కథనం. అందుకే జాతకాల్లో సర్పదోషాలు ఉన్నవాళ్లు ఇక్కడ శాంతి పూజలు చేసుకుంటే అవి పరిహారం అవుతాయని నమ్మిక. అంతేకాదు, సుబ్రహ్మణ్య స్వామిని సంతాన కారకుడిగా, సంపత్తి దాతగా, ఆరోగ్య ప్రదాతగా భావిస్తుంటారు. స్వామి అనుగ్రహంతో ఇవన్నీ సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.

బుద్ధిని ప్రేరేపించే శక్తి
కార్తికేయుడిని ‘మహామతి’గా అభివర్ణిస్తారు. ఆయన బుద్ధిని ప్రేరేపించే స్వామి. సుబ్రహ్మణ్య ఆరాధనతో మనోబలం లభిస్తుంది. స్వామి అనుగ్రహంతో బుద్ధి ప్రచోదనం అవుతుంది. సత్కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది. ‘బుద్ధి శక్తి దేవత’ అని శరవణభవుణ్ని స్తుతిస్తారు. ఆయన ఉపాసనతో దుష్కర్మలు చేయాలన్న తలంపు తొలగిపోతుంది. సత్కర్మలు ఆచరించాలన్న బుద్ధి పుడుతుంది.

ఉచిత విద్య

కుక్కిలోని ఆశ్రమం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. అందరికీ ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. భోజనం, దుస్తులు, బస్సు సౌకర్యం కూడా ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు ఆశ్రమంలో వేద విద్యను కూడా బోధిస్తున్నారు.

వేద నిధి సంశోధన

కుక్కి క్షేత్రంలోని ‘సంపుట నరసింహస్వామి సుబ్రహ్మణ్య మఠం’ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నది. ధార్మిక ప్రచారంతోపాటు సామాజిక సేవ కూడా నిర్వహిస్తున్నది. సమాజంలో భక్తిని జాగృతం చేయడానికి ధార్మిక సందేశాన్ని అందిస్తున్నది. మఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహిస్తున్నారు. రామాయణ, భారత, భాగవతాల ప్రాశస్త్యాన్ని ఈ తరానికి తెలియజేస్తున్నారు. గో సంరక్షణ చేపడుతున్నారు. ‘వేద వ్యాస సంశోధన’ కేంద్రం ఏర్పాటుచేసి దాని ద్వారా ఆధ్యాత్మిక నిధిని పరిరక్షిస్తున్నారు. మరుగున పడిన ఆధ్యాత్మిక సాహిత్యానికి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. తాళపత్ర గ్రంథాలను పునర్ముద్రిస్తున్నారు. బెంగళూరులోనూ మఠం ఏర్పాటుచేశారు. అహోబిలంలో మరో మఠం ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి, హైదరాబాద్‌ నగరాల్లోనూ శాఖలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement