ఉపనిషత్ వాక్యం
సన్మానాత్ బ్రాహ్మణో నిత్య ముద్విజేత విషా దివ
అమృతస్యేవ చాకాంక్షే దవమానస్య సర్వదా॥
(నారద పరివ్రాజక ఉపనిషత్తు 3-40)
బ్రహ్మనిష్ఠుఁడు తనకు ఇతరులు చేసే సన్మానాన్ని విషంలా భావించాలి. అవమానాన్ని ఎల్లప్పుడూ అమృతంలా భావించి కోరుకోవాలి.సన్మానం పొందడంలో విశేషమేమీ లేదు. అవమాన అనుభవమే ఆధ్యాత్మిక సాధన. దానినే సాధకుడు అభ్యసించాలి. అదే సాధనకు గీటురాయి. ఈ ఉపనిషత్ వాక్యానికి అతికినట్టు సరిపోయే ఒక మహాభక్తుని ఉదంతం పరిశీలిద్దాం!
పాండురంగని భక్తుడైన ఏకనాథుడు రోజూ గోదావరిలో స్నానం చేసి వచ్చి దేవతార్చన చేసుకునేవాడు. గిట్టనివారు ఎలాగైనా అవమానించాలని పథకం వేసుకుని ఒక ఆకతాయి పిల్లవాణ్ని ఉసిగొలిపారు. ఏకనాథుడు ఒకరోజు మామూలుగా నదిలో స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఆ పిల్లవాడు తుపుక్కున ఉమ్మి వేసినాడు. ఏకనాథుడు నవ్వుతూ కిమ్మనకుండా మళ్లీ స్నానం చేసి వచ్చాడు. మళ్లీ ఆ కుర్రాడు అలాగే చేశాడు. ఈ విధంగా 107 సార్లు జరిగింది.
ఏకబిగిన ఉమ్మి వేయడంతో ఆ పిల్లవాని నోరు ఎండిపోయింది. ఏకనాథుడు మాత్రం ఆ ఆకతాయిని పల్లెత్తు మాటా అనలేదు. చివరికి ఆ తెంపరి బాలుడు పశ్చాత్తాపంతో భోరున ఏడుస్తూ ఏకనాథుడి పాదాలపై పడ్డాడు. ‘ఫలానా వారు మిమ్మల్ని అవమానించాలని నన్ను పురమాయించార’ని జరిగింది విన్నవించాడు. ఏకనాథుడు ఆ పిల్లవాణ్ని కౌగిలించుకొని ‘నాయనా! నీవు నాకు మేలే చేశావు. నీవల్ల ఈ రోజు 108సార్లు గోదావరిలో స్నానం చేసే పుణ్యం దక్కింది! ధన్యవాదాలు’ అన్నాడు. అవమానాన్ని భరించే ఏకనాథుని క్షమాగుణం సదా స్మరణీయం, ఆచరణీయం!
…? డా.వెలుదండ సత్యనారాయణ