‘జాతవేదసే సునవామ సోమ
మరాతీ యతో నిదహాతి వేదః..’
అని చెబుతుంది త్రిపురా తాపిని ఉపనిషత్తు.‘ఎవని నుంచి జ్ఞానం పుట్టునో, అలాంటి అగ్ని కోసం సోమాన్ని ఇస్తాము. మమ్మల్ని బాధింపదలచిన వారిని అగ్ని దహించుగాక’ అని పై శ్లోక భావం. ఒకసారి రాఘవేంద్ర స్వామి శిష్యులతో సంచారం చేస్తూ ఒక పట్టణంలో ఒక న్యాయవాది ఇంట్లో బసచేశారు. మర్నాడు ఆ గృహస్తుని ఇంట్లో కులదేవతా సమారాధనం జరుగుతున్నది. పెద్ద ఎత్తున అన్న సంతర్పణం చేస్తున్నారు. కుల పురోహితుడికి అట్టహాసం ఎక్కువ. రాఘవేంద్ర స్వామి స్నానం చేసి, పూజ ముగించుకొని పారాయణం చేస్తూ ఉన్నాడు. ఇంటికి భిక్షకోసం వచ్చిన వైదికులను చూసి పురోహితుడు డాంబికాన్ని ప్రదర్శిస్తూ… ఒక్కొక్కరికీ ఒక్కో పని పురమాయిస్తున్నాడు. వచ్చిన వారికి గంధం తీయడానికి ఎవరూ కనిపించలేదు. పురోహితుడి దృష్టి రాఘవేంద్ర స్వామిపై పడింది. అందరిలాంటి అతిథే అనుకున్న ఆయన రాఘవేంద్ర స్వామితో ‘అవిగో సానరాయి, గంధపు చెక్క! వందమందికి సరిపడేంత గంధం తీసిపెట్టు’ అని ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు.
ముందురోజు నడక వల్ల బాగా అలసిపోయిన స్వామివారు మంత్రాలు పఠిస్తూనే గంధం తీయసాగారు! అంతమందికి గంధం తీయడం అంటే మాటలా! ఓపికగా గంధం తీసి, దానిని ఒక పాత్రలోకి చేర్చారు. ఇంతలో పురోహితుడు రానే వచ్చాడు. స్వామిని చూస్తూ ‘ఇంతసేపా!’ అని గద్దించాడు. గంధం పాత్రను పురోహితుడికి అందించాడు స్వామి. తీర్థ వినియోగం తర్వాత అందరికీ గంధం ఇచ్చారు. అంతా ఆనందంగా అలదుకున్నారు. అదేమోగానీ, గాలి సోకినంతనే వాళ్ల ఒళ్లంతా భగభగ మంటలెత్తాయి. అందరూ పురోహితుణ్ని దుయ్యబట్టారు. ఆయన స్వామివారిని నిలదీశారు. స్వామివారు మరికొంత గంధం తీసి వరుణ సూక్తంతో అభిమంత్రించి ఇచ్చారు. దానిని రాసుకోగానే అందరి తాపం శాంతించి చల్లబడ్డారు. ఆ గృహ యజమాని స్వామివారి మహిమను కొనియాడి కారణం అడిగాడు. అగ్నిసూక్తం పారాయణం చేస్తూ ఉంటే పురోహితుడు పరుష వాక్కులతో గంధం తీయమని పురమాయించడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు స్వామి. అగ్నిదేవుని రక్షణలో ఉన్నవారి మనసు నొప్పించరాదని, అది అగ్నిదేవుడి ఆగ్రహానికి కారణం అవుతుందని ఈ దృష్టాంతం తెలియజేస్తున్నది.