శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల దేవస్థానం ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు నిర్వహించాల్సిన కైంకర్యాలకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, వాహనసేవలు, ప్రభోత్సవం, రథోత్సవం, వీరాచార విన్యాసాలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కార కార్యక్రమాలు ఘనంగా జరిపించనున్నట్లు వివరించారు. ఉత్సవ ప్రారంభం రోజున యాగశాల ప్రవేశంలో మొదలై ప్రతి రోజు ఉదయం హోమజప కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
సాయంత్రం వేళలో వాహనసేవల్లో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు దర్శమిస్తారని తెలిపారు. ఉగాది పర్వదినాన దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ పఠన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం జరిగే రథోత్సవంలో అమ్మవారు రమావాణి సహిత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిసుందని స్థానాచార్యులు పేర్కొన్నారు. అదే విధంగా మహోత్సవాల్లో ఆఖరి రోజున నిజరూపాలంకరణలో భ్రమరాంబ అమ్మవారు దర్శనం ఇస్తారని వివరించారు.